మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం 2019-2020 సంవత్సరంలో ఖేల్ ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకున్నది. రాష్ర్టానికి ఆరు క్రీడాపాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ కేంద్రమైన ఉట్నూర్, జాతర్ల.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఒకటి కేటాయించింది. సరిగ్గా ఆరేండ్లలో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాకుండా ఉట్నూర్ ఐటీడీఏకు మంచి గుర్తింపు తెస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు క్రీడాపాఠశాలలను ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతో గిరిజన క్రీడాకారులు జాతీయ స్థాయిలో మెరుస్తున్నారు. ఒక్కో క్రీడాకారుడు నాలుగైదు సార్లు జాతీయ స్థాయిలో ఆడారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇటీవల నిర్వహించిన సాయ్ హాకీ అకాడమీలో ఏకంగా తొమ్మిది మంది క్రీడాకారులు ఎంపిక కావడం విశేషం.
– ఉట్నూర్, ఆగస్టు 1

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఉట్నూర్ ఐటీడీఏ కేంద్రంలో బాయ్స్ క్రీడా పాఠశాలలో హాకీ, అథ్లెటిక్స్, ఖో ఖో.. జాతర్ల బాయ్స్ క్రీడాపాఠశాలలో కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీబాల్.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బాలికల కోసం హైండ్బాల్, అథ్లెటిక్స్, ఖోఖో ప్రారంభించారు. ఇందులో యేటా 5వ తరగతికి 40 మంది విద్యార్థులను బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం వీరికి కోచ్‌ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రోజు ఉదయం, సాయంత్రం ఖోఖో, హాకీ, అథ్లెటిక్స్ క్రీడలపై సాధన చేయిస్తారు. అలాగే ప్రతి విద్యార్థికి అదనంగా 50 రూపాయల డైట్‌తో కూడిన పౌష్టికాహారం అందిస్తారు. వీటితోపాటు క్రీడా దుస్తులు, పరికరాలు, క్రీడలలో పాల్గొనేందుకు టీఏలు, డీఏలు ప్రత్యేకంగా అందిస్తారు. దీంతోపాటు ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధనను కూడా అందిస్తున్నారు.

ఉట్నూర్ పాఠశాలకు చెందిన హాకీ క్రీడాకారులు 102 మంది రాష్ట్రస్థాయిలో పాల్గొన్నారు. ఇందులో 45 మంది బంగారు పథకాలు, 12 మం ది వెండి పథకాలు, 15 మంది బ్రౌన్ మోడల్స్ సాధించారు. అదే వి ధంగా ఉట్నూర్ పాఠశాలకు చెందిన 50 మంది క్రీడాకారులు దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొన్నారు. జాదవ్ చరణ్, సాయి చరణ్, పూసం మోతీ రాం, ఆత్రం జగ్జీవన్, ధన్‌రాజ్, సీహెచ్ సాయిరాం, ఆ త్రం శంభు, కిరణ్, అజయ్ కుమార్, వెంకటేశ్, సా యి ప్రసాద్ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కొక్కరు నాలుగు, ఐదు సార్లు జాతీయస్థాయి పోటీలలో వారి ప్రతిభను చాటుకున్నారు. రా ష్ట్రస్థాయిలో జిల్లాను ఒంటిచెత్తో గెలిపించే సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలోని గిరిజన క్రీడాపాఠశాలలకు చెందిన 135 మంది విద్యార్థులు అథ్లెటిక్స్‌లో ఇంతవరకు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు. వీరిలో 43 మంది బంగారు పథకాలు, 32 మంది రజత పథకాలు, 26 మంది కంచు పథకాలు గెలుపొందారు. అదే విధంగా 14 మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. వీరిలో హెచ్‌కే నగేష్, శంకర్, నరేష్‌లు జాతీయ స్థాయి పోటీలలో ఒక బంగారు, మూడు వెండి, ఒక కంచు పథకాలను రాష్ర్టానికి సాధించి పెట్టారు.

ఉట్నూర్ క్రీడా పాఠశాలకు చెందిన ఖోఖో క్రీడాకారులు 127 మంది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 69 మంది బంగారు, 9 మంది రజత, 11 మంది కంచు పథకాలు అందుకున్నారు. 40 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 11 మంది రజత, 4 కంచు పథకాలను సాధించారు. ఇందులో శంకర్, సురేందర్, శివసాయి, శివచరణ్, యాదవ్షావ్, హనుమంతు, సురేందర్, ఉదయ్ కిరణ్, నిఖిల్ కుమార్‌లు పథకాల సాధనలో ముందున్నారు.
గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయిలో రాణించేలా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద్ చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా తాము ఉత్తమమైన కోచ్‌లను ఎంపిక చేసుకొని ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం. విద్యార్థులకు క్రీడలతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. శివకృష్ణ, శేఖర్ కోచ్‌లు నిరంతరం క్రీడాకారులతో మమేకమై శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం క్రీడాపాఠశాలలకు మరిన్ని సౌకర్యాలు కలిస్తే క్రీడాకారులు మంది రాణిస్తారు.
– పార్థసారథి, జిల్లా గిరిజన క్రీడాధికారి, ఉట్నూర్.