మంచిర్యాల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ‘మీరు తప్పులు చేస్తున్నారు.. మేం విమర్శలు ఎదురొంటున్నాం. మీ సొంత నిర్ణయాలతో మేం ఇబ్బందులు పడుతున్నాం..’ ఇదీ రెండు రోజుల కిందట ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏకంగా రాష్ట్ర మంత్రి సీతక ఆవేదన ఇది..ఐసీడీఎస్‌లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదే పెద్ద నిదర్శనం. కొద్ది రోజుల కిందట కందిపప్పు కొనుగోలు విషయంలో అధికారులు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా నచ్చిన వారికి కట్టబెట్టారు.
అంగన్వాడీల్లో అధికారులు నిబంధనలు తుంగలో తొకుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ కాంట్రాక్టు అయినా నచ్చిన వారికి కట్ట బెడుతున్నారు. ఇదంతా జిల్లాలోనే ఉన్నతాధికారులకు సైతం తెలియకుండా చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పును సరఫరా చేసే కాంట్రాక్టర్ల ఎంపిక ఇష్టారాజ్యంగా సాగుతున్నది. నిబంధనల ప్రకారం టెండర్లను ఆహ్వానించి, తకువ ధరకు కోట్ చేసే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాలి. కందిపప్పు కొనుగోళ్లకు రాష్ట్రస్థాయి అధికారులు గరిష్ఠ ధర కిలో రూ.164గా నిర్ణయించారు. దీన్ని అధికారులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
వాస్తవానికి అధికారులు నిబంధనలకు అనుగుణంగా పనులు చేసి టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి తకువ ధరకు కోట్ చేసే అవకాశాలుంటాయి. ప్రభుత్వానికి ఖర్చు మిగులుతుంది. అయితే, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కొందరు అధికారులు మాట్లాడుకుని ఎలాంటి టెండర్లు లేకుండానే కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. మంచిర్యాల జిల్లాలో కట్టబెట్టిన కంట్రాక్టర్ రూ.163 కోట్ చేశారు. గతంలో ఇకడ కోడిగుడ్లు సరఫరా చేసిన వ్యక్తికే ఈ పప్పు సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టు కూడా అప్పజెప్పడం గమనార్హం. ఆయన చిన్న కోడిగుడ్లు సరఫరా చేయడంపై వచ్చిన విమర్శలను ఉన్నతాధికారులు పట్టించుకోకుండా ఇప్పుడు తిరిగి ఆయనకే కందిపప్పు కాంట్రాక్టు అప్పజెప్పడం అనుమానాలకు తావిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించగా, అకడ తకువకు కోట్ చేశారు. హైదరాబాద్‌లో కిలోకి రూ.118, సూర్యాపేటలో రూ.122.22, ఖమ్మంలో రూ.124.95, పెద్దపల్లిలో రూ.131 చొప్పున ధర చెల్లించి, కందిపప్పును కొనుగోలు చేస్తున్నారు. మంచిర్యాలలో మాత్రం రూ.163కు కోట్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం రిటైల్ మారెట్లో కిలో కందిపప్పు ధర రూ.95 నుంచి రూ.120 మధ్యే ఉండడం గమనార్హం..ఇలా అధికారులు తమకు నచ్చిన వారికి కట్టబెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుండడం గమనార్హం. ఇందులో డబ్బుల స్థానంలో అడ్వాన్స్‌గా చెకు ఇచ్చినట్లు తెలుస్తున్నది.
ఇంత జరిగినా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు ఈ వ్యవహారం తెలియక పోవడం గమనార్హం. కాంట్రాక్టు విషయంలో టెండర్లు పిలవకపోయినా డీపీసీ (డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ) ద్వారా అయినా కందిపప్పు కొనుగోలు చేయాలి. కానీ కలెక్టర్ సైతం ఇది తెలియకపోవడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో ఏకంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక వీడియో కాన్ఫరెన్స్‌లో సీరియస్ అయ్యారు. కందిపప్పు కొనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు..? కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫరాను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది..? సంజాయిషీ ఇవ్వాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంగుతినడం అధికారుల వంతయింది. మరి ఇప్పటికైనా అధికారులు నామినేషన్ పద్ధతిలో కేటాయించిన ఈ కందిపప్పు టెండర్ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తారో లేక అలాగే కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే..