మంచిర్యాల, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కనకదుర్గ చిట్‌ఫండ్ బోర్డు తిప్పేసినట్లు తెలిసింది. ఆ చిట్‌ఫండ్ కార్యాలయం ఉన్న బిల్డింగ్‌కు టులెట్ బోర్డు సైతం పెట్టిన నిర్వాహకులు.. అసలు కార్యాలయం ఉం చుతున్నారా.. తీసేస్తున్నారా.. అనే విషయంపై స్పష్టత లేదు. అసలు ఎన్ని చిట్ గ్రూపులు వేశారు.. ఎన్ని గ్రూప్‌లు క్లోజ్ అ య్యాయి.. ఎంత మందికి పేమెంట్ చేశా రు.. ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉంది.. ఈ వివరాలేవీ చెప్పడానికి చిట్‌ఫండ్ కార్యాలయ సిబ్బంది ఇష్టపడడం లేదు. ఏం అడిగినా జిల్లా చిట్ రిజిస్ట్రార్ దగ్గర తీసుకోండి.. అసలు మీరెవరు మమ్ముల అడుగడానికి, అయినా మాకు ఈ సంస్థకు సంబంధం లేదు.
మాకే జీతాలు ఇవ్వడం లేదంటూ.. చర్చ జరుగుతున్నంత సేపు తలాతోక లేకుండా సమాధానాలు చెప్తూ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అసలు చిట్‌ఫండ్ అనేది పబ్లిక్ డబ్బులతో నడిచే సంస్థ. చిట్టీ నడిపినందుకు కొంత కమీషన్ తీసుకొని పని చేయాలి. చిట్టి వేసిన వారు, చిట్టి వేసిన వారి తరఫున వెళ్లి అడిగే వారు, అంతెందుకు కామన్ పీపుల్ వెళ్లి అడిగినా దాని లావాదేవీలకు సంబంధించిన వివరాలు చెప్పాలి. కానీ ఇందుకు విరుద్ధంగా సదరు చిట్‌ఫండ్ సిబ్బంది వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ చిట్‌ఫండ్‌లో రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చిట్టీలు వేసిన బాధితులు కొందరు ‘సమస్తే తెలంగాణ’కు ఫోన్ చేసి విషయం చెప్పారు. చిట్టీ కోసమని తాము కోట్లాది రూపాయాలు కట్టామని, తీరా ఇప్పుడు మేము కట్టిన పైసలు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు.
నెల రోజులుగా జిల్యా వ్యవసాయశాఖలో జరుగుతున్న అక్రమాలు, యూరియా ఇండెంట్ మార్చి ఎరువులు, ఫర్టిలైజర్ షాపులు ఇచ్చే మామూళ్లకు రుచి మరిగి అధికారులు పాల్పడిన అక్రమాలకు ‘నమస్తే తెలంగాణ’ కథనాలు అద్దం పట్టాయి. వరుస కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా వ్యవసాయశాఖపై ప్రత్యేకాధికారితో ఎంక్వైరీ చేయించిన కలెక్టర్ బదావత్ సంతోష్ ఆ నివేదికను వ్యవసాయశాఖ కమిషనర్‌కు పంపించారు. దాదాపు పత్రిక ప్రచురించిన ప్రతి విషయం నిజమేనని అధికారులు ఎంక్వైరీలో గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంపై బాధ్యులపై త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇది నాణేనికి ఒకవైపు కాగా.. చెన్నూర్ వ్యవసాయ డివిజన్లో భా రీగా జరిగిన అవకతవకలపై కథనం ప్రచురితమైన రోజు.. కొందరు ఫర్టిలైజర్ షాపు యాజమానులను సంప్రదించారు.
చెన్నూర్ ఏడీఏ సార్ చెప్పడంతో తాము కనకదుర్గ చిట్‌ఫండ్‌లో చిట్టీలు వేశామని, రెండేళ్లు, రెండున్నరేండ్లు క్రమం తప్పకుండా ప్రతి నెలా చిట్టీ కట్టామని, ఇప్పుడేమో చిట్‌ఫండ్ ఎత్తేస్తున్నట్లు తెలిసిందని, కనీసం మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండని అడిగినా తిప్పించుకుంటున్నారని తమగోడును వెలబోసుకున్నారు. అసలు చెన్నూర్ వ్యవసాయ శాఖ ఏడీఏ సార్‌కు ఈ చిట్‌ఫండ్‌కు సంబంధం ఏందబ్బా అని ఎంక్వైరీ చేయగా.. ఆ సారు భార్య ఈ చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా ఉన్నట్లు తెలిసింది. చిట్టీలు వేయి స్తే లక్షలాది రూపాయల కమీషన్ వస్తుందని కక్కుర్తి పడిన ఆ మేడం సార్‌ను ఫోర్స్ చేశారంటా.
దానితో ఆయన మన లావాదేవీలు యూరియా, ఎరువుల కేటాయింపు ఇలాగే కొనసాగాలంటే మీరు చిట్టీలు వేయాలంటూ పట్టుబడ్డారంట.. దీంతో చేసేదేమీ లేక కనకదుర్గ చిట్‌ఫండ్స్‌లో చిట్టీలు వేసినట్లు బాధితులు చెప్పారు. ఇదేసారు చెప్పడంతో వ్యవసాయశాఖలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు సైతం చిట్టీలు వేసినట్లు తెలిసింది. ఈ విషయంపై చెన్నూర్ ఏడీఏ బాపును వివరణ కోరగా.. మాది మధ్య తరగతి కుటుంబమని, ఇద్దరం పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నా భార్య ఏజెంట్‌గా చేరిందన్నారు. ఫర్టిలైజర్ షాపుల యాజమానులు, మా శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఎవ్వరినీ నేను ఇబ్బంది పెట్టలేదన్నారు. మా మేడం ఏజెంట్ కావడంతో అందరినీ అడిగినట్లే వారిని అడగ్గా చిట్టీలు వేశారని చెప్పారు.
మొత్తంగా ఈ చిట్ ఫండ్ వ్యవహారంలో 10కి పైగా చిట్టీ గ్రూప్‌లు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ గ్రూప్‌లన్నీ కూడా రూ.10లక్షలపైనే ఉన్నట్లు తెలిసింది. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిట్టీలు ఎత్తుకున్న వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న చిట్‌ఫండ్ సిబ్బంది.. చిట్టీలు కడుతున్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో మాత్రం నోరుమెదపడం లేదు. గట్టిగా నిలదీస్తే సంస్థకు చెందిన ప్లాట్లు ఉన్నాయి. మీరు కట్టిన డబ్బులు ఇవ్వలేమని, ప్లాట్లు తీసుకోండని బలవంతంగా అంటగడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు కొన్న భూములను రెట్టింపు చేసి అదనంగా డబ్బులు గుంజుతున్నారు.
ఇక చేసేదేం లేక కట్టిన డబ్బులు తిరిగి వస్తాయో, రావోననే భయంతో చాలా మంది చిట్టీ కడుతున్న వారు అదనపు డబ్బులు చెల్లించి ప్లాట్లను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయంపై చిట్‌ఫండ్ మేనేజర్ మహేందర్ని వివరణ కోరగా.. మేము సంస్థలో ఉద్యోగులమని, హెడ్ ఆఫీస్ వరంగల్‌లో ఉందని, రెండేళ్ల నుంచి చిట్టి పాటను నిలిపివేశామని చెప్పారు. కస్టమర్లు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నా.. సంస్థ వారికి ఇచ్చే పరిస్థితి లేదని, పెట్టిన వెంచర్లో ప్లాట్లు కొనుక్కుంటేనే మంచిదంటూ ఉచిత సలహా ఇచ్చారు.
“వ్యవసాయ శాఖలో అక్రమాలపై ఉన్నతాధికారులు ఎలాగైతే స్పందించారో.. ఈ విషయంలోనూ అట్లనే స్పందించాలి. మంచిర్యాలలో ఎన్నో చిట్‌ఫండ్స్ బోర్డు తిప్పేశాయి. జనం డబ్బుల కోసం ఆ కంపెనీల చుట్టూ తిరిగి గోసపడుతున్నారు. వ్యవసాయ శాఖలో పని చేసే అధికారి చెప్పారనే మేము చిట్టీలు వేశాం. కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయలు అందులో కట్టాం. అవి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అధికారులే చొరవ తీసుకొని మా డబ్బులు ఇప్పించాలే. నా పేరు చెప్తే నా వ్యాపారం దెబ్బతీస్తరు. నన్నే టార్గెట్ చేస్తరు. ఎలాగైనా ఈ విషయం మీ పేపర్లో వచ్చేటట్లు చూడండి.” అని ఓ బాధితుడి తెలిపాడు.