సంసారయూథ గజసింహదంష్ర్టా భీతస్య దుష్టమైదైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవభీతి నివారణేన లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
అల వైకుంఠాన్ని తలపించే పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రధానాలయం పునఃప్రారంభం తొలిసారి వచ్చిన బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణ వేడుకను కనులారా వీక్షించి భక్తజనం పరవశించింది.
దేవదేవుడు నృసింహుడు పట్టువస్ర్తాలు, స్వర్ణ, వజ్రవైఢూర్యాలతో అలంకృతుడై గజ వాహనంపై తూర్పు మాఢవీధుల్లోని మండపానికి ఊరేగింపుగా రాగా, భక్తజనకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీ అమ్మవారు పూలపల్లకిలో చేరుకున్నారు. తుల లగ్న సుముహూర్తాన యాదగిరీశుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. మంత్రులు స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
– యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 28