లక్షెట్టిపేట రూరల్, జూలై 6 : అప్పట్లో తాగునీటికి మస్తు గోస పడ్డం. మా ఊరిలోని ఫిల్టర్ బెడ్ వద్దకు నడుసుకుంట పోయి తెచ్చుకునేటోళ్లం. ఇగ ఇంటి అవసరాలకైతే మరీ తిప్పలయ్యేది. మస్తు లొల్లి అయితుండె. ఇగ ఎండకాలమైతే మా బాధలు చెప్పనక్కర్లేదు. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక అన్ని బాధలు పోతున్నయ్. ముఖ్యంగా తాగు నీళ్లకు తిప్పల లేకుండా చేసిండు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లిస్తున్నడు. కాలు కదపకుండా ఇంటి వద్దనే నీళ్లు పట్టుకుంటున్నం. ఇంటి అవసరాలకు కూడా గీ నీళ్లనే వాడుకుంటున్నం. సీఎం కేసీఆర్‌కు మా మహిళలంతా రుణపడి ఉంటరు.
కాళేశ్వరం టూ ఎల్లంపల్లికి..
నాడు పిల్ల కాలువ..
కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టుల నిర్మాణానికి ముందు మంచిర్యాల జిల్లా పక్కనున్న గోదావరి చిన్న పాయలా పారేది. అవతల ఉన్న ఎల్లంపల్లి నుంచి గుడిపేట, నమ్నూర్ గ్రామాల మధ్య పిల్లకాలువను తలపించేది. ఈ చుట్టు పక్క ప్రాంతాల వారు సాగు, తాగు నీటికి తల్లడిల్లేవారు. తలాపున గోదావరి పారుతున్నా.. ఆ నీటిని వాడుకోలేకపోతున్నామని బాధపడేవారు.
నేడు మహా సంద్రం..
2004లో సమైక్య పాలకులు ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించి వదిలేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎల్లంపల్లికి మంచిరోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ రూ.5,400 కోట్లు వెచ్చించి 2016లో పూర్తి చేయించారు. గతంలో పిల్ల కాలువను తలపించిన ఎల్లంపల్లి ప్రాంతం.. ఇప్పుడు గోదావరి మహానది స్వరూపాన్ని కండ్లకు కడుతున్నది. మంచిర్యాల మొదలుకొని ధర్మపురి వరకు నిండుకుండను తలపిస్తున్నది.
నాడు దుర్భరం.. నేడు అద్భుతం..
మంచిర్యాల, జూలై 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. సాగుకు అదునుదాటి పోయిందని రైతులు ఆందోళన పడుతుండగానే.. తాగునీటి అవసరాలకు నీరు ఉంటుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ.. తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు వేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన నీరు అందుబాటులోకి వచ్చింది. ఎక్కడో కాళేశ్వరంలో ఎత్తిపోస్తున్న నీరు మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో తాగునీటికే కాదు.. సాగుకు కూడా ఢోకా ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 12 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జిల్లా రోజువారి తాగునీటి అవసరాలకు 0.09 టీఎంసీలు సరిపోతాయి. గోదావరి అటు పక్కనున్న పెద్దపల్లి జిల్లావాసులు ఎల్లంపల్లి నీరు వాడుకున్నా.. ప్రస్తుతం ఉన్న నీటితో దాదాపు ఐదు నెలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిర్యాలకు తాగునీరు ఇవ్వొచ్చని మిషన్ భగీరథ అధికారులు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం నీరు కూడా వచ్చి చేరుతున్నందున తాగునీటికి సమస్య వస్తుందనే ఆలోచన కూడా చేయద్దని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని తొమ్మిది మండలాల్లో సుమారు 350 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాజెక్ట్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు పడకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నన్ని రోజులు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
బెడ్ లెవల్ వరకు నీరు..
కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్న ఎల్లంపల్లి ప్రా జెక్టు నిండుకుండను తలపిస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు గేట్ల (బెడ్ లెవల్) వరకు అంటే 145 అడుగుల వరకు నీరు ఉంది. ఎల్లంపల్లి దిగువనున్న పార్వతీ పంప్‌హౌస్ నుంచి 10,440 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా కొంత నీరు వ స్తున్నది. నంది మేడారం పంప్‌హౌస్ నుంచి 6,635 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. మొత్తంగా 20.175 టీ ఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ఇప్పటికే దా దాపు 12-13 టీఎంసీల నీరు ఉంది. మంచి వర్షాలు కురిసిన గతేడాది ఇదే సమయానికి రిజర్యాయర్లో 8.8 టీఎంసీల నీరు ఉంటే.. కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న నీటితో ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉంది. ఎల్లంపల్లి నుంచి మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా మంచిర్యాల జిల్లాకు తాగునీరు సరఫరా అవుతున్నది. మొత్తం 18 మండలాల్లో ఒక జన్నారం మినహా 17 మండలాలకు భగీరథ నీరు అందుతోంది. ఇందులో కోటపల్లి, భీమారం, జైపూర్, హాజీపూర్, దండేపల్లి మండలాలు సహా లక్షెట్టిపేట, చెన్నూర్, నస్పూర్, మంచిర్యాల మున్సిపాలిటీలకు ఎల్లంపల్లి నీరే ఆధారం. బెల్లంపల్లి నియోజకవర్గం మొత్తానికి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు.
ఎల్లంపల్లి ఎండితేనే నీటికి కటకట..
ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం ఎండిపోతేనే మంచిర్యాల జిల్లాకు తాగునీటి కటకట ఉంటుంది. ఎందుకంటే మంచిర్యాలకు తాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) ప్రాజెక్టు లోపల చాలా కిందకు ఉంది. మొత్తం డ్యాం ఎండిపోతేనే నీళ్లు డబ్ల్యూటీపీకి రావడం ఆగిపోతుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్ నిండుకుండలా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా సమస్య వచ్చినా మంచిర్యాలకు మాత్రం వచ్చే పరిస్థితి లేదు. కాళేశ్వరం పంపులు ఎత్తిపోస్తే తాగునీటికే కాదు సాగునీటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– కృష్ణ, డీఈ, మిషన్ భగీరథ