గంగనీళ్ల ఎత్తిపోతల జాతరకు వేళయింది. రెండు దశాబ్దాల నిర్మల్‌వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారం కానుంది. మహా పోచమ్మ గంగనీళ్ల జాతరకు ముందే గోదావరి నదీ జలాలు ఎత్తిపోయనుండడంతో అన్నదాత కండ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ 27ను నేడు(బుధవారం) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ప్రారంభించనున్నారు. శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని రూ.714 కోట్లతో నిర్మించగా.. 99 గ్రామాల్లోని దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. 20 ఏండ్లుగా ఒకే పంటకు పరిమితమైన భూముల్లో ఇక మూడు పంటలు రానుండగా, అన్నదాతల సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, నిర్మల్ నియోజకవర్గ రైతులకు సాగు నీరందేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రైతన్నలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– నిర్మల్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ)
నిర్మల్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ) : రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గోదావరి జలాల ఎత్తిపోతల పథకం ఎట్టకేలకు సాకారం కానున్నది. మహా పోచమ్మ గంగనీళ్ల జాతరకు ముందే గోదావరి నదీ జలాల జాతర ఎత్తిపోయనుండడంతో అన్నదాత కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది. గోదావరి నీళ్లను ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ 27,28 (శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకం) కలను సాకారం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నేడు ఎత్తిపోతల పథకం ప్రారంభం కానున్నది. ప్రతి ఎకరానికి సాగు నీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటిని తరలించి సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాకు తాగు, సాగు నీరందించే ప్యాకేజీ 27, 28 ఎత్తిపోతల పథకం, సదర్మాట్ బ్యారేజ్ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో పనుల్లో వేగం పుంజుకున్నది. కాగా.. ప్యాకేజీ 27 పనులు ఇప్పటికే 70 శాతం పూర్తి కావడంతో నిర్మల్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరందనున్నది. రూ.714 కోట్లతో చేపట్టిన 27 ప్యాకేజీ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని 99 గ్రామాల్లోని దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందను న్నది. అలాగే రూ.525 కోట్లతో చేపట్టిన 28 ప్యాకేజీ కింద ముథోల్ నియోజక వర్గంలోని 58 గ్రామాల్లోని 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. అంతే కాకుండా నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,016 ఎకరాలను స్థిరీకరించడం కోసం మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై సదర్మాట్ బ్యారేజీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆయా పనులు పూర్తయితే నిర్మల్ జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగు నీరందనున్నది.
నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ-27 (లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకం) నిర్మాణ పనులు 15 ఏళ్ల తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పూర్తయ్యాయి. ఈ పథకం కింద కాలువల నిర్మాణం కూడా పూర్తి కావడంతో నేడు(బుధవారం) మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ పథకం ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్పూర్, నర్సాపూర్ (జి), కుంటాల, సారంగాపూర్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, సోన్ మండలాల్లోని 99 గ్రామాల పరిధిలో గల చెరువులు, కుంటలకు నీరందించే అవకాశం కలిగింది. ఈ మేరకు బుధవారం స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఎత్తిపోతల పథకానికి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం చేయనున్నారు.
ప్యాకేజీ 27 పనులను మూడు యూనిట్లుగా విభజించి పనులను పూర్తి చేశారు. మొదటి యూనిట్ కింద 32 వేల ఆయకట్టును నిర్ధేశించారు. ఇందులో భాగంగా దిలావర్పూర్ గ్రామ శివారులో సిస్టర్న్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్లోకి సాగు నీటిని ఎత్తి పోయనున్నారు. యూనిట్-1 కింద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో గుండంపెల్లి వద్ద ఇప్పటికే పంప్‌హౌస్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ 6.70 కిలోమీటర్ల పొడువుతో అప్రోచ్ చానల్‌ను నిర్మించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పొడువు 29.50 కిలో మీటర్లు కాగా, ఈ కాలువ ద్వారా నీటి సరఫరా సామర్థ్యం 140 క్యూసెక్కులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే రైట్ మెయిన్ కెనాల్ పొడువు 13.50 కిలోమీటర్లు కాగా, నీటి సరఫరా సామర్థ్యం 100 క్యూసెక్కులుగా ఉంది.
ఇదిలా ఉంటే రెండో యూనిట్ కింద 5 వేల ఎకరాల ఆయకట్టును నిర్ధేశించారు. దీనికోసం దిలావర్పూర్ గ్రామ శివారులో మొదటి పంప్‌హౌస్ డెలివరీ సిస్టర్న్ వద్ద రెండో పంప్‌హౌస్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి పంపింగ్ ద్వారా నీటిని ఎత్తి పోయనున్నారు. దీని పరిధిలో లెఫ్ట్ కెనాల్ పొడువు 7.50 కిలోమీటర్లు కాగా, రైట్ కెనాల్ పొడువు 3.75కిలోమీటర్లుగా ఉంది. ఆయా కెనాల్స్ నీటి సరఫరా సామర్థ్యం 20 క్యూసెక్కులుగా ఉంది. అలాగే.. 3వ యూనిట్ కింద 13 వేల ఆయకట్టును నిర్ధేశించారు. సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామం వద్ద మూడో పంప్‌హౌస్ నిర్మాణంలో ఉంది. ఈ పంప్‌హౌజ్‌లోని రెండు పం పుల ద్వారా సరస్వతీ కెనాల్లో నుంచి నీటిని ఎత్తి పోయాలని ప్రతిపాదించారు. దీనికింద 17.50 కిలోమీటర్ల మేర లెఫ్ట్ కెనాల్, 1.90 కిలోమీటర్ల మేర రైట్ కెనాల్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.
నాకు దిలావర్పూర్ గ్రామ సమీపంలో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మా భూమి సమీపంలోనే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో మా భూములకు పుష్కలంగా సాగు నీరందనున్నది. ఒకప్పుడు ఇక్కడి భూములకు ఏ మాత్రం డిమాండ్ ఉండేది కాదు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కృషితో తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, సాగు నీటి సదుపాయాన్ని కల్పించడంతో మా భూముల ధరలు మూడింతలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి రైతులంతా అండగా ఉండి మళ్లీ గెలిపించుకుంటాం. రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలి.
– కోడె నవీన్, రైతు, దిలావర్పూర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు. ఆయన ప్రతిక్షణం రైతుల మేలు కోసం ఆలోచించే మనసున్న మనిషి. నిర్మల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాలు గోదావరి నదికి సమీపంలోనే ఉన్నప్పటికీ సాగు నీటికి నోచు కోలేదు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. కాళేశ్వరంలో భాగంగా ప్యాకేజీ 27 ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మల్ నియోజకవర్గానికి సాగు నీరందించాలన్న లక్ష్యంతో రూ.714 కోట్లు కేటాయించారు. సకాలంలో నిధులు మంజూరు కావడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, నియోజకవర్గ రైతులకు సాగు నీరందేలా చేసిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి.
దిలావర్పూర్ శివారులో నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఏడేళ్ల క్రితం ఈ భూమిని కొనుగోలు చేశా. ఇప్పటివరకు నీటి సదుపాయం లేకపోవడంతో కేవలం వానకాలంలో మాత్రమే వర్షాధార పంటలు పండేవి. కొత్తగా నిర్మించిన ఎత్తిపోతల పథకం ప్రారంభం కానుండడంతో ఇక మాకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏడాదికి మూడు పంటలు పండించుకునే అదృష్టం కలిగింది. ఇంతకంటే సంతోషం ఏముంటుంది. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. ఈ ప్రాంత రైతులు కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.