నిర్మల్ అర్బన్, జూలై 12 : నిర్మల్‌లో బీజేపీ పెద్ద షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బుధవారం ఆయన కమలం వీడి కారెక్కారు. నిర్మల్‌లోని దివ్యగార్డెన్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అప్పాల గణేశ్‌తో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువా కప్పి మంత్రి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అంతకుముందు బైల్ బజార్ నుంచి దివ్య గార్డెన్ వరకు ఆయన అనుచరులతో బైక్ ర్యాలీ తీశారు. అప్పాల గణేశ్‌తో పాటు కౌన్సిలర్లు కత్తి నరేందర్, సైండ్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల రవి, తోట నర్సయ్య, గోపు గోపి, నేళ్ల అరుణ్, సాకీర్, అలీం, అప్పాల ప్రభాకర్, బీజేపీ, కాంగ్రెస్, పార్టీలకు చెందిన పలువురు యువకులు, కుల సంఘాల నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలో ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడ వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని గుర్తు చేశారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో మెడికల్, నర్సింగ్, కళాశాలలు వచ్చాయని, ఇక ఇంజినీరింగ్, ఐటీ హబ్‌ను తీసుకువస్తామన్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గణేశ్ లాంటి వారు తిరిగి సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు.
సమష్టిగా పని చేసి నిర్మల్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎమెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ ప్రజలను మరో సారి మోసం చేసేందుకు అనేక పార్టీలు వస్తున్నాయని వాటిని తిప్పికొట్టాలని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పకుంటే ఈ రోజు కరెంట్, రేపు పింఛన్, రైతు బందు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇలా అన్ని సంక్షేమ పథకాలను వద్దు అంటారు. ఇలాంటి వారిని గ్రామ పొలిమేర వరకు తరిమికొట్టాలన్నారు. పార్టీ అధ్యక్షుడు విఠల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమ కోసం పాటు పడుతున్న బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి ఖాయమన్నారు. జడ్పీచైర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడుతున్న బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని ఇది శుభపరిణామం అన్నారు.
చివరి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా : అప్పాల గణేశ్
అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా ఉన్న బీఆర్ఎస్ పార్టీలోనే తన తుది శ్వాస ఉన్నంత వరకు కొనసాగుతానని, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో 10 వేల మెజారిటీతో గెలిపిస్తానని అప్పాల గణేశ్ అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నాలుగున్నర సంవత్సరాల పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దూరంగా ఉన్నానని, ఇప్పుడు పార్టీ వీడనని పార్టీ బలోపేతానికి సైనికుడిలాగా పని చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, అల్లోల తిరుపతి రెడ్డి, యువ నాయకులు అల్లోల గౌతం రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.