ఎదులాపురం, సెప్టెంబర్ 14 : బీఆర్ఎస్ హయాంలోనే నూతన సమీకృత కలెక్టరేట్‌కు రూ.55 కోట్లు మంజూరై 20 శాతం పనులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో బిల్లులు రాక పని ప్రారంభం కాలేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పాత కలెక్టరేట్ భవనం కూలిందన్నారు. అయితే భవనం కూలిన ప్రదేశంలో బీఆర్ఎస్ నాయకులు పరిశీలనకు వెళ్తే వారిపై కేసులు నమోదు చేశారన్నారు. ప్రతిపక్ష హోదాలో తాము ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే యత్నం చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
కూలిన ప్రదేశాన్ని ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్లు పరిశీలిస్తే అది నిషేధిత ప్రదేశం కాదు. కానీ.. బీఆర్ఎస్ వారు వెళ్తేనే నిషేధం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఉద్యోగుల భద్రతరీత్యా ప్రభుత్వం వెంటనే నూతన భవన పనులతోపాటు పెండింగ్ పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు పార్టీ నాయకులు అజయ్, మెట్టు ప్రహ్లాద్, యూనీస్ అక్బానీ, యాసం నర్సింగ్, సాజిదొద్దీన్, పవన్ నాయక్, నారాయణ, కలీం ఉన్నారు.