ఇప్పటికే రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు
ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగం పక్కా
సర్కారు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి..
నౌకర్లు సాధించిన వారి సూచనలు, సలహాలు..
ఆదిలాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;‘కష్టేఫలి’ కష్టపడ్డవారికే ఫలాలు దక్కుతాయి. ఈ నానుడి ఉద్యోగార్థులకు అతికినట్టు సరిపోతుంది. సర్కారీ కొలువు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లేవారు పక్కా ప్రణాళికతో చదివితే ఉద్యోగం రావడం ఖాయం. ఈ విషయాన్ని తెలంగాణ సర్కారు ఏర్పడిన అనంతరం దాదాపు 1.33 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇందులో కొందరు అభ్యర్థులు ఒక్కొక్కరు రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 14 మందికిపైగా ఉన్నారు. నామమాత్రంగా చదవొద్దని, పక్కా ప్రణాళిక, పట్టుదల, సాధించాలనే లక్ష్యంతో ప్రిపేర్ అయితే కొలువు కొట్టవచ్చని ఉద్యోగం పొందిన వారు తెలుపుతున్నారు. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించగా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ప్రభుత్వం వివిధ ఉద్యోగాలను ప్రకటించిన నేపథ్యంలో యువత పకడ్బందీ ప్రణాళికలతో,
కష్టపడి చదివితే కొలువులు సాధించవచ్చు. ప్రత్యేత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.33 లక్షల ఉద్యోగాలను సర్కారు భర్తీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారు. రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించిన వారు 14 మంది ఉన్నారు. యువత నామ్కేవాస్తేగా చదివితే లాభంలేదని పక్కా ప్రణాళికలతో, పట్టుదలతో కొలువులకు ప్రిపేర్ కావాలని ఉద్యోగాలు సాధించిన వారు అంటున్నారు. ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిందని, ప్రిపరేషన్‌కు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిందని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. –
అత్తామామల ప్రోత్సాహంతో మూడు ఉద్యోగాలు..
సోన్, మార్చి 14 :నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన వీరమల్ల పోతన్న- గంగామణిల కూతురు నవత. పోతన్న విద్యుత్‌శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండగా.. తల్లి గృహిణి. వీరికి ఐదెకరాల భూమి ఉండగా.. వ్యవసాయ పనులు చేస్తూనే కూతురిని బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చేలా ప్రోత్సాహించారు. నిర్మల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం, హైదరాబాద్‌లో ఇంటర్, ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో రోజూ పది గంటలు చదివింది. 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ రాగా దరఖాస్తు చేసుకుంది. అంతలోనే నిర్మల్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగితో వివాహం జరిపించారు. పెళ్లి అయినప్పటికీ భర్త, అత్త, మామల ప్రోత్సాహంతో చదువుపై దృష్టి పెట్టిన నవత వరుసగా మూడు కొలువులకు ఎంపికైంది.
2019లో గ్రామ కార్యదర్శిగా ఎంపికై మామడ మండలంలో విధుల్లో చేరింది. ఆరు నెలలపాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా.. వీఆర్వో ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల కావడంతో వీఆర్వోగా ఎంపికైంది. గ్రామ కార్యదర్శికి రాజీనామా చేసి వీఆర్వోగా బొప్పారం గ్రామంలో బాధ్యతలను తీసుకుంది. బాధ్యతలు తీసుకున్న నెల రోజులకే మళ్లీ దక్షిణ మధ్య రైల్వేబోర్డు నిర్వహించిన ఉద్యోగ ఎంపికలో అసిస్టెంట్ లోక్ పైలట్‌గా ఎంపికైంది. ఏడాదిలోనే మూడు ఉద్యోగాలు సాధించింది. అయితే రెవెన్యూశాఖ ద్వారా ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకే రెవెన్యూశాఖలో విధుల్లో చేరినట్లు నవత తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్‌ను వేయడంతోనే తనకు ఉద్యోగం వచ్చిందని జీవితంలో స్థిరపడే అవకాశం లభించిందని తెలిపారు.
పట్టుదలే నిలిపింది..
దస్తురాబాద్, మార్చి 14 : పట్టుదలతో చదివి ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించారు ఉమారాణి. దస్తురాబాద్ మండలంలోని పెర్కపల్లె గ్రామానికి చెందిన సువర్ణ-భూమన్న దంపతుల మొదటి కుమార్తె ఆమె. 2001లో దస్తురాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ఇంటర్ వరకు మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో, 2006లో డిగ్రీ, 2008లో పీజీ, 2012లో బీఈడీని పూర్తి చేసింది. 2009 లో ఆర్టీసీ ఆఫీస్ కండక్టర్‌గా ఎంపికైంది. ఆ జాబ్‌ను వద్దనుకొని గ్రూప్స్ లక్ష్యంగా ప్రిపేరైంది. 2012లో సివిల్, కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి, ఎక్సైజ్ కానిస్టేబుల్‌కు నోటిఫికేషన్ రాగా, వాటికి దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాసింది. 2014లో మూడింటికి ఒకేసారి ఎంపికైంది. చివరకు ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరింది. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నది. తల్లీదండ్రులు, భర్త ప్రోత్సాహంతోనే ఉద్యోగాలు సాధించినట్లు చెబుతున్నది. మూడు ఉద్యోగాలు ఒకేసారి రావడం చాలా సంతోషమనిపించిందని పేర్కొంది.
ఉద్యోగ సాధనే లక్ష్యంగాముందుకెళ్లాలి
నిర్మల్ టౌన్, మార్చి 14 : తెలంగాణ ప్రభుత్వం అన్ని విభాగాల్లో కొలువులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే చదువుతో పాటు సామాజిక అంశాలపై పట్టు సాధించాలి. నోటిఫికేషన్ రాగానే పరీక్ష తేదీకి ఎంత సమ యం ఉందో తెలుసుకోవాలి. పోటీ పరీక్షల రకం, బిట్స్ నమూనా, వ్యాస రకాలను ముందుగానే ఎంపిక చేసుకొని అవగాహనకు రావాలి. సిలబస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకోవచ్చో ప్రణాళిక రూపొందించుకోవాలి. సబ్జెక్టులు ఎన్ని, ఒక్కోదానికి ఎంత సమ యం తీసుకుంటుందో నిర్ణయించాలి. సంబంధిత సబ్జెక్టులకు సంబంధించిన తెలుగు అకాడమీ పుస్తకాలను ఎంచుకోవాలి. మధ్యమధ్యలో పోటీ పరీక్ష రాసి నెగ్గిన వారి అనుభవాల గురించి తెలుసుకోవాలి.
ప్రస్తుతం మారుతున్న పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఆయా సబ్జెక్టులకు సంబంధించిన కంప్యూటర్ జ్ఞానం పెంపొందించుకోవాలి. ప్రతిరోజూ సామాజిక అంశాలపై అవగాహన పెంచుకునేందుకు న్యూస్ పేపర్స్ చదవాలి. య్యూట్యూబ్ మెటీరియల్స్‌ను ఉపయోగించుకోవాలి. న్యూస్ పేపర్లో వచ్చే మోడల్స్‌ను ప్రాక్టీస్ చేసుకోవాలి. సమయానికి భోజనం చేసి ఆరోగ్యంగా ఉండాలి. ఆడియో, వీడియో లెస్సన్స్ చూస్తూ ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. అర్థంకాని ప్రశ్నలకు సీనియర్ల వద్ద జవాబులు రాబట్టుకోవాలి. ఉద్యోగ నోటిఫికేషన్లలో చదువుకు తగ్గ అర్హత ఉన్న ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ ఉద్యోగానికి సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను సిద్ధం చేసుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలి. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి. జనరల్సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కష్టపడి.. కొలువు కొట్టి
దండేపల్లి, మార్చి 14 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారీ ఉద్యోగమంటే మాటలు కాదు. కానీ ఈమె మాత్రం ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి, ఆదర్శంగా నిలిచింది. దండేపల్లి మండలం కొర్విచెల్మ(రాజంపేట) గ్రామానికి చెందిన ముద్దసాని నర్సవ్వ- శ్రీహరి పెద్ద కూతురు ఉషారాణి. లక్షెట్టిపేటలో హైస్కూల్ వరకు, ఇంటర్, ఇంజినీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. తెలంగాణ సర్కారు వేసిన నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకొంది. మొదటగా ఎఫ్‌బీవో, పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్), వీఆర్వో ఉద్యోగాలకు ఎంపికైంది. గతేడాది గ్రూప్-4 ఉద్యోగానికీ ఎంపికైంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కాల్ లెటర్ రాకపోవడంతో వీఆర్వోగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో విధుల నిర్వహిస్తుంది.
భర్త, తల్లీదండ్రుల ప్రోత్సాహంతోనే..
నా భర్త ఉదయ్‌కుమార్ ప్రోత్సాహంతోనే నాలుగు ఉద్యోగాలు సాధించగలిగాను. 2019 నుంచి వీఆర్వోగా పనిచేస్తున్న. చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనే కోరిక నాన్నకు ఉండేది. ఆయన చెప్పినట్లే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందిస్తున్న. ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదు.
– ఉషారాణి
ఉద్యోగం మనదే అనుకొని చదువుకోవాలి
నాకు పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేసిన నేపథ్యంలో యువకులు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం మనదే అనుకొని చదువాలి. ఉద్యోగాలకు బాగా పోటీ ఉందని భయపడవద్దు. కొలువు తప్పనిసరిగా వస్తుందనే నమ్మకంతో ఉండాలి. గతంలో పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించిన వారి సలహాలు తీసుకోవాలి. నిరుద్యోగుల కోసం ప్రభుత్వం స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రైవేటు కోచింగ్ బదులు వీటిల్లో చేరితే ప్రయోజనం ఉంటుంది. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది.
– ఏ రాకేశ్, డిప్యూటీ తహసీల్దార్, మంచిర్యాల
నిరుత్సాహం పనికిరాదు
నేను పోలీస్ కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి, టీజీటీ ఉద్యోగాలు సంపాదించాను. చదువుకున్న యువకులు తమకు ఉద్యోగం రాదని నిరుత్సాహ పడవద్దు. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసిన వారికి అనుభవం వస్తుంది. ఈ సారి ఉద్యోగాల సాధనకు ఎంతగానో ఉపయోపడుతుంది. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాలకు ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాలి. సిలబస్‌ను పూర్తిస్థాయిలో చదువాలి. ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు రోజూ రెండు గంటల సమయం కేటాయించాలి. ఉద్యోగం వస్తుందనే గట్టి నమ్మకంతో ఉండాలి.
– అబ్దుల్ సాజిద్, టీజీటీ. సిర్పూర్(టీ), కాగజ్‌నగర్