ఇచ్చోడ, జూలై 26 : బోథ్ నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసమే జాబ్‌మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. శనివారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. 62కు పైగా ప్రముఖ కంపెనీలు ఒకే చోట చేరి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా జాబ్ మేళాకు ముందు ముఖ్యఅతిథులుగా వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్‌లకు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు.
మొదట జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, నేరడిగొండ, బోథ్, తలమడుగు, తాంసి, సొనాల గుడిహత్నూర్ మండలాల నుంచి 6,448 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 4,532 మంది హాజరయ్యారు. 312 మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియామక పత్రా లు అందజేశారు. వారికి భోజన వసతి కల్పించారు.
త్వరలోనే ఆసిఫాబాద్‌లో నిర్వహిస్తాం..
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం త్వరలో జాన్సన్ నాయక్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. నిరుద్యోగుల కోసం ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు.
అధికారంలో లేకున్న ప్రజా సేవలో ఉంటాం..
అధికారంలో లేకున్న ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. నిరుద్యోగుల కోసం మాజీ మంత్రి కేటీఆర్, జాన్సన్ నాయక్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. తాము అధికారంలో లేకున్న ప్రజల్లో ఉండి సేవ చేసే వారే బీఆర్ఎస్ నాయకులని అన్నారు.
అనంతరం భుక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజా సేవ చేయడం కోసమే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారన్నారు. పార్టీలకు అతీతంగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి, బోథ్, ఇచ్చోడ మాజీ ఎంపీపీలు తుల శ్రీనివాస్, ప్రీతం రెడ్డి, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, బోథ్ మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ సర్పంచ్ పెంటన్న, హెచ్‌వో కిరణ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బోథ్ చరిత్రలోనే మొదటిసారి..
నేను పదో తరగతి చదువుకున్నా. ఇచ్చోడ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఉందని తెలియడంతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యా. నాకు ఫ్లిప్ కార్టు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నియామక పత్రాన్ని అందించారు. ఉద్యోగం రావడంతో నా కుటుంబం అంతా ఆనందంగా మునిగిపోయారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు రుణ పడి ఉంటా.
– షేక్ ఇర్ఫాన్, బజార్హత్నూర్.
నిరుద్యోగులుసద్వినియోగం చేసుకోవాలి..
బోథ్ చరిత్రలోనే ఇప్పటికీ ఏ నాయకుడు కూడా మెగా జాబ్‌మేళా నిర్వహించలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్న నిరుద్యోగుల కోసం పార్టీలకు అతీతంగా మెగా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాం. ప్రజలకు కష్ట సుఖాల్లో అండగా ఉంటాం. యేటా జూలైలో నియోజకవర్గం లోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తాం. మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్విని యోగం చేసుకోవడం ఆనందంగా ఉంది.
నిరుద్యోగులకు సువర్ణ అవకాశం..
నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళా ఒక సువర్ణ అవకాశం. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వ ర్యంలో 62 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిం చడం శుభపరిణామం. దాదాపు 6448 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కు హాజరై నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వ డం వారిలో నైపుణ్యం మెరుగుప డుతుంది. మారుమూల నిరుద్యోగులకు మెగా జాబ్‌మేళా నిర్వహించడం బాగుంది. ఈ జాబ్ మేళాను ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలి.
– కార్తీక్, హెచ్ఆర్, కో-కంపెనీ డైరెక్టర్, హైదరాబాద్.
మెడి ప్లస్‌లో జాబ్ వచ్చింది..
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఇంటర్వ్యూకు హాజరయ్యా. నాకు మెడి ప్లస్‌లో జాబ్ వచ్చింది. నెలకు రూ.14 వేలు జీతం ఇస్తారని తెలిపారు. నేను ఇంటర్ వరకు చదువుకున్నా. నాన్న షాపులో పని చేస్తున్నారు. అమ్మ గృహిణి. జాబ్ రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి జాబ్ మేళాను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిర్వహించడం నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది.
– రిషిత, ఇచ్చోడ.