ఉట్నూర్, జూలై 17 : ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా డౌన్ డౌన్ అంటూ.. మా సమస్యలు వినే ఓపిక పీవోకు లేదని గురువారం కార్యాలయం ఎదుట తుడుందెబ్బ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనను వివమింపజేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావులు మాట్లాడుతూ.. ఆదివాసుల సమస్యలను పీవోకు చెప్పేందుకు వస్తే తమకు సమయం ఇవ్వడం లేదని మండిపడ్డారు.
గంట తర్వాత తమకు అవకాశం కల్పించగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఆర్టీల ఖాళీల వివరాలు ఇవ్వకుండా నియామకం ఎలా చేపడుతారని ప్రశ్నించామన్నారు. డీడీ కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఉన్నారని, వారిని తొలగించాలని డిమాండ్ చేస్తుండగా వీడియోలు తీయడాన్ని తాము ప్రశ్నించామన్నారు.
దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం పీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన నాయకులను ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్ఐ ప్రవీణ్‌లు సముదాయించి పక్కకు జరుపుతుండగా ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఆదివాసీ నాయకులను సముదాయించడంతో నిరసన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు దేవేందర్, మెస్రం శేఖర్ పాల్గొన్నారు.