మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 30 : వైద్యుడి నిర్లక్ష్యమే.. పసికందు ప్రాణం తీసిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాత బెల్లంపల్లి పట్టణానికి చెందిన గందం గంగవ్వ పురిటి నొప్పులతో గత మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరగా, అదే రోజు వైద్యులు నార్మల్ డెలవరీ చేశారు. మొదటి కాన్పులో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు పరిస్థితి విషమంగా మారడంతో బెల్లంపల్లి చౌరస్తాలోని అవని పిల్లల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నాలుగు రోజుల పాటు చికిత్స అందించారు. శిశువు కోలుకుందని చెప్పి శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు.
ఈ క్రమంలో గంగవ్వకు ఫిట్స్ రావడంతో స్థానికంగా ఉన్న ఎంసీహెచ్‌కు తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ ఎంసీహెచ్‌కు తీసుకెళ్లారు. ఆపై శిశువును కూడా తల్లి వద్దకు చేర్చారు. ఆదివారం శిశువు.. తల్లి పాలు తాగకుండా.. కదలకుండా.. ఉండటాన్ని గమనించారు. వెంటనే పిల్లల దవాఖాన వైద్యుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మరోసారి పాపను తీసుకురావాలని డాక్టర్ చెప్పాడు.
ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి పాప మృతి చెందింది. సోమవారం ఉదయం శిశువు మృతదేహంతో దవాఖానకు చేరుకున్నారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే పాప మృతిచెందిందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ప్రమోద్‌రావు, ఎస్ఐలు ముత్తె ప్రవీణ్, వినిత ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై అవని హాస్పిటల్ వైద్యుడిని వివరణ కోరగా.. తను పాపకు సరైన వైద్యమే అందించానని, కోలుకున్న తర్వాతే డిశ్చార్జి చేశానని, 48 గంటల తర్వాత వచ్చి పాప మృతి చెందిందని ఆందోళన చేశారన్నారు.