మంచిర్యాల, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడుత రుణమాఫీలో అనేక మంది రైతుల పేర్లు గల్లంతయినట్లు తెలుస్తున్నది. ఒకరిద్దరు కాదు.. వేలాది మందికి అన్యాయం జరిగినట్లు సమాచారమున్నది. జాబితాలో లేని రైతులకు రుణమాఫీ జరుగుతుందా..? లేదా..? అన్నదానిపై స్పష్టత నివ్వకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. అసలు ఏ నిబంధనల ప్రకారం రుణమాఫీ చేశారో స్పష్టత ఇవ్వకపోవడం అయోమయానికి గురిచేస్తున్నది.
అసలు రుణమాఫీ అర్హుల జాబితా ఏ ప్రాతిపదికన తయారు చేశారన్న దానిపైనా క్లారిటీ లేదు. రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రేషన్‌కార్డు యూనిట్‌గా రుణమాఫీ చేస్తుండడంతో ఇప్పటికే చాలా మందికి అన్యాయం జరిగింది. రేషన్‌కార్డు లేని వారికి అసలు మాఫీ జరగలేదు. దీనిపై వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే రేషన్‌కార్డు లేనోళ్లకు సర్వే చేసినంక మాఫీ చేస్తారని చెబుతున్నారు. ఆ సర్వే ఎప్పుడు చేయాలి.. మా రుణాలు ఎప్పుడు మాఫీ కావాలంటూ రైతులు పెదవి విరుస్తున్నారు.
లిస్టులో పేర్లున్నప్పటికీ కొందరు రైతులకు రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకులకు వెళ్లి అడిగితే ప్రాసెస్‌లో ఉంది రేపో.. ఎల్లుండో పడుతుందని, ట్రెజరీలో ఉంది ఇంకా పడలేదని చెబుతున్నారు. మరికొందరు రైతులకు కేవైసీ పెండింగ్ ఉండడం వల్ల రుణం మాఫీ కాలేదంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న రైతులు చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. జన్నారంలో ఓ రైతు నా లోన్ ఎందుకు మాఫీ అవ్వలేదని అడిగితే… ‘బ్యాంక్ అధికారులు మా చేతుల్లో ఏం లేదు.. ప్రభుత్వం పంపించిన రైతుల రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నాం.. లేని వారివి చేయడం లేదు’అంటూ తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆ రైతు ప్రెస్‌క్లబ్ దగ్గరకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశాడు. రూ. లక్ష లోపు రుణం ఉన్నా.. మాఫీ కాని కొందరు రైతులు తమ గోడును ‘నమస్తే తెలంగాణ’కు చెప్పుకున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ), జూలై 19 : జిల్లాలో రూ. లక్ష లోపు పంటరుణాలు తీసుకున్న రైతులు 1.22 లక్షల మంది ఉండగా, ప్రభుత్వం రూ. 125.50 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరిలో ఎంత మందికి రుణాలు మాఫీ అయ్యాయో అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం లేకపోవడం రైతులను గందరగోళానికి గురిచేస్తున్నది. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదో అర్థంకాక అధికారులను ఆశ్రయిన్నారు. ఎందుకు రుణం మాఫీకాలేదో బ్యాంకు వారికి తెలుసని.. వ్యవసాయ అధికారులు అంటుంటే.. వ్యవసాయ అధికారులకు తెలుసని.. బ్యాంకు అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వాంకిడి, జూలై 19 : ప్రభు త్వం రూ. లక్ష లోపు పంట రుణం మాఫీ చేస్తున్నట్లు ప్రక టించింది. కానీ నాకు వాంకిడి లోని స్టేట్ బ్యాంకులో రూ. 97 వేల రుణం ఉంది. మాఫీ కాలే. లిస్టులో నా పేరు లేదు. నా పేరు ఎందుకు రాలేదని శుక్రవారం బ్యాంకుకు వెళ్లి సార్లను అడిగిన. వాళ్లు నోరు మెదపలే. ఎంతో ఆశతో ఎదురు చూసిన. ఇలా అవుతుం దనుకోలే.
– ఆత్రం అయ్యి, చౌపన్‌గూడ, వాంకిడి మండలం
వాంకిడి, జూలై 19 : వాంకిడిలోని స్టేట్ బ్యాంకులో రూ. 90 వేల పంటరుణం తీసుకున్న. ప్రభుత్వం గురువారం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. శుక్రవారం బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ ఎందుకు కాలేదని అడిగిన. నేను కేవైసీ చేయించలేదని చెప్పిన్రు. మరి కేవైసీ చేయించకపోతే నాకు పంటరుణం యేటా ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పంటరుణాలు మాఫీ చేస్తదని మస్తు నమ్మినం. గిట్లా మా ఆశలపై నీళ్లు చల్లుతదని అనుకోలే.
– ఆత్రం మెంగు, ఖానాపూర్, వాంకిడి మండలం
తాండూర్, జూలై 19 : నాకు కాసిపేట గ్రామంలో కొంత వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 43 వేల పంట రుణం 2023కు ముందే తీసుకున్న. అప్పటి నుంచి యేటా మిత్తి కట్టి తిరిగి రుణం తీసుకుంటున్న. ప్రభుత్వం చెప్పినట్లు రుణమాఫీ అవుతుందనుకున్న. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో నా పేరు లేదు. నాకు రేషన్ కార్డు లేదు, ఫ్యామిలీ వివరాలు సరిగా లేవని, ఎంక్వయిరీ చేయాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నాకు తకువ భూమి ఉన్నా రుణ మాఫీ చేయలేదు. ఇందుకు బాధగా ఉంది.
– బోగె కృష్ణ, రైతు, కాసిపేట
తాండూర్, జూలై 19 : కేసీఆర్ సర్కారులో నా భార్య ఉప్పరి భూదేవి పేరిట తీసుకున్న రుణం మాఫీ అయ్యింది. గతంలో బ్యాంకులో తీసుకున్న పంట అప్పు రెండు నెలల కిందే కట్టాను. ఇప్పుడే మో నా భార్యతో పాటు నాకు కూడా రుణమాఫీ కాలే. గతంలో నా పేరిట రూ. 50 వేలు, నా భార్య పేరిట రూ. 50 వేల రుణం తీసుకుంటే మాఫీ అయినయి. ఇప్పుడు కాంగ్రెస్ సరారులో కాలే. నాకు, నా భార్యకు కలిపి రూ. లక్ష లోపే రుణం ఉంది. కానీ ఇద్దరిలో ఎవరికీ రుణమాఫీ అవ్వలే. కాంగ్రెస్ సరారోళ్లు ఏం చెబుతున్నరో.. ఏం చేస్తున్నరో అర్థం కావడం లేదు. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి అడిగితే డబ్బులు వస్తాయని చెబుతున్నరు.
– ఉప్పరి భూదేవి-లచ్చయ్య, రేచిని
తాండూర్, జూలై 19 : 2021లో తీసుకున్న రూ. 82 వేలకు పోయినే డు బ్యాంకులో రిన్వల చేసిన. రెండు నెలల కిందే వడీత్డో సహా చెల్లించా ను. సిబిల్ సోర్ కోల్పోకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించిన. లిస్టులో పేరు ఉన్నప్పటికీ రుణమాఫీ జరగలేదు. ప్రస్తుతం నాకు రావాల్సి న డబ్బులు ట్రెజరీకి వెళ్లిపోయినట్లు తెలిసింది. వ్యవసాయ అధి కారులు మాత్రం ప్రాసెస్‌లో ఉంది డబ్బులు పడుతయని చెబుతు న్నరు. నాకు న్యాయం చేయాలే.
– పబ్బని తిరుపతి, తాండూర్
జన్నారం, జూలై 19 : నాకు మా ఊరిలో ఎకరం భూమి ఉంది. 30-6 -2020న ఇందన్పల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో రూ. 45 వేల రుణం తీసుకున్న. నాకు రుణమాఫీ కాలే. బ్యాంక్, వ్యవసాయశాఖ అధికారులను కలిసి అడిగితే మేము లిస్టు పంపించలేదు. దాని గురించి మాకు తెల్వదంటున్నరు. అన్ని అర్హతలున్న నాకు రుణమాఫీ చేయకపోవడమేమిటి. ఇప్పటికైనా న్యాయం చేయాలె.
– రాజమౌళి, కిష్టాపూర్