మందమర్రి, జూలై 10 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ప్రాణహిత కాలనీ సమీపంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారు ల ఎంపికలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని, జాబితాపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చే యాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు సూరిబాబు, రాజశేఖర్, కొంగల తిరుపతి రెడ్డి, ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ మం దమర్రి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో 560 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించడంతో పాటు లబ్ధిదారుల జాబితా కూడా ప్రకటించడం జరిగిందన్నారు. శాసన సభ ఎన్నికలు రావడంలో ఇండ్ల కేటాయింపు జరుగలేదని, అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జాబితాను రద్దు చేసి, మరో జాబితా ప్రకటించారని, 230 మంది లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించారని పేర్కొన్నారు.
ఇటీవల ప్రకటించిన జాబితాలో కూడా అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు, ఐదు ఎకరాలపై చిలుకు భూములున్న వారితో పాటు సొంత గృహా లు కలిగిన వారిని కూడా అర్హులుగా ప్రకటించారని, అర్హులైన నిరుపేదలకు అన్యా యం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఎం పిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి జాబితాను రూపొందించారని, అట్టి జాబితాను పక్కన పెట్టడం సరికాదన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను అనర్హులకు కేటాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చంచారు. జాబితాలో జరిగిన అవకతవకలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.
ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలి.
మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో చేపట్టిన ఓటరు సమగ్ర సర్వేపై బీఎల్వోలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేసేందుకు ప్రజలు, నిరక్షరాస్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఫారాలను పూర్తి చేయడంలో అనేక అనుమానాలు చోటు చేసుకుంటున్నాయని వారు అన్నారు. ఈ నెల 24వ తేదీతో గడువు ముగుస్తుందని, ఇప్పటి వరకూ మున్సిపాలిటీలో 10 శాతం కూడా ఓటరు నమోదు ప్రక్రియ పూ ర్తి కాలేదని వారు అన్నారు. అన్ని వార్డులలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఫారాలను పంపిణీ చేస్తూ ఫొటోలు దిగుతున్నారే తప్ప వాటిని ఎలా పూర్తి చేయాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడం లేదని వారు ఆరోపించారు.
తాడిచెర్ల-2గని సరే మరి కేకే-6 గని….
సింగరేణి మందమర్రి ఏరియాలో గనులన్నీ ఒక్కొక్కటిగా మూత పడుతూ ఉపాధి అవకాశాలు తగ్గిపొతున్నాయని, కేంద్ర ప్రభుత్వం వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనులను కేటాయించడం ఇందుకు కారణమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రస్తుతం సింగరేణి పరిరక్షణ సదస్సులను నిర్వహించడం జరగుతుందన్నారు. బీఆర్ఎస్, కార్మిక సంఘాల ఉద్యమాల నేపథ్యంలో తాడిచెర్ల-2 బ్లాకును వేలం లేకుండానే సింగరేణికి కేటాయించారని వారు స్పష్టం చేశారు.
తాడిచెర్ల-2 బ్లాకును తామే ఇచ్చామని బీజేపీ, తాము తీసుకవచ్చామని కాంగ్రెస్ పార్టీ నాయకలు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ మందమర్రి ఏరియాలో నూతనంగా గుర్తించిన కేకే-6 గని సంగతి ఏమిటని ప్రశ్నించారు. కేకే-6 గనిని సింగరేణికి అప్పగిస్తే మందమర్రి ఏరియాకు పూర్వ వైభవం వస్తుందని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కేకే-6 గనిని వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బత్తుల శ్రీనివాస్, తోట సురేందర్, భూపెల్లి కనకయ్య, సాగర్, దాసరి రాజనర్సు, మొగురం శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు.