ఆదిలాబాద్, మే 13(నమస్తే తెలంగాణ) : జిల్లాలో జొన్నను సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో 15 కేంద్రాల్లో పంటను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో యాసంగితో జొన్న సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు దిగుబడులు ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల వరకు వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.3371 ఉండగా.. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.2500తో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువ ఉండడంతో ప్రభుత్వం కేంద్రాలకు భారీగా పంట వచ్చింది. ప్రభుత్వ కేంద్రాల వద్ద పంటను విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నారు.
జొన్నల కొనుగోళ్లలో అక్రమాలకు దళారులు పన్నాగాలు ప్రారంభించారు. మహారాష్ట్రలో తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి జిల్లాకు తీసుకొస్తున్నారు. గ్రామాల్లో రైతుల పట్టాలు తీసుకుని వారితో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ కేంద్రాల్లో జొన్నలు విక్రయిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర నుంచి అక్రమంగా జిల్లాకు తరలిస్తున్న జొన్నల వాహనాలను భీంపూర్ పోలీసులు పట్టుకున్నారు. కొనుగోళ్లలో అక్రమాలను నివారించడానికి జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దళారులు మాత్రం కొత్త మార్గాల ద్వారా పంటను అమ్మడానికి ప్రయత్నాలు వీడడం లేదు.
ఇటీవల ముగిసిన పత్తి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు పత్తి కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్రమాలకు తెరలేపారంటూ ప్రభుత్వం ఆదిలాబాద్ మార్కెట్ కార్యదర్శి మధూకర్, ఇచ్చోడ మండల వ్యవసాయ శాఖ అధికారిని సస్పెండ్ చేసింది. దళారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి సీసీఐకి విక్రయించడానికి మార్కెట్ యార్డులకు తీసుకురావాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు 3400 టీపీలను జారీ చేశారు. అధికారులు దళారులకు సహకరించడంతో రైతుల పేరిట పత్తిని సీసీఐకి విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. జొన్నల కోనుగోళ్లలో దళారులు అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉండడంతో ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, సాగు చేసిన రైతులకు నష్టం జరగకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానకాలం, యాసంగిలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను తెలుసుకునేందుకు క్రాప్ బుకింగ్ చేపడుతారు. యాసంగిలో క్రాప్బుకింగ్లో జాప్యం జరిగింది. జొన్న పంట చేతికొచ్చిన వివరాల సేకరణ ప్రారంభం కాలేదు. తర్వాత వ్వవసాయ శాఖ సిబ్బంది పంటల వివరాలు సేకరించిన కచ్చితమైన సమాచారం ఏ మేరకు తీసుకున్నారనే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వానకాలం సీజన్లో సాగు చేయాని రైతులు పత్తిని పండించారన్నట్లు క్రాప్బుకింగ్ చేయడంలో దళారులకు అవకాశం ఇచ్చినట్లుయిందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. క్రాప్ బుకింగ్ సక్రమంగా జరిగేతే సాగు చేసిన రైతులు మాత్రమే ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం ఉంటుందంటున్నారు.