పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చింది. అర్హులైన పేదల ఇంటికి సాయం మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మూడ్రోజుల పాటు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన వారు పూర్తి ధ్రువీకరణ పత్రాలను జత చేసి దరఖాస్తును అందజేస్తున్నారు. ఈక్రమంలో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ఆదిలాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) :ఇళ్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఉచితంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా పంపిణీ చేసింది. స్థలంతో పాటు రెండు గదుల శ్లాబ్ ఇండ్లను నిర్మించి ఇచ్చింది. పేదలందరికీ సొంతింటిని అందించడానికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది.
ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షలను మంజూరు చేస్తుండగా ఇంటి నిర్మాణంలో భాగంగా దశల వారీగా ప్రభుత్వం అందజేసే డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. బేస్మెట్, రూప్ లెవల్, ఇళ్లు పూర్తయిన తర్వాత పూర్తిగా చెల్లిస్తారు. లబ్ధిదారులు తమకు నచ్చిన విధంగా ఇండ్లు కట్టుకునే అవకాశం ఉండగా, ప్రభుత్వం మహిళల పేరిట ఇండ్లను మంజూరు చేస్తుంది. గ్రామాల్లో సొంతంగా ఉన్న పేదలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారు. పూరి గుడిసెల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇంటిని నిర్మించుకోవడానికి సాయం అందిస్తుండడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు అందిస్తున్న సాయంతో తాము ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..
జిల్లాలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇండ్లను మంజూరు చేయడానికి అర్హులైన పేదల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తహసీల్ కార్యాలయాల్లో పేదలు దరఖాస్తులను అందజేస్తుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నారు. మూడ్రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తుదారులు అప్లికేషన్ఫారంతో పాటు రెండు పాస్ఫొటోలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, కరెంటు బిల్లు, ఇంటి పన్ను రశీదులు జతపర్చాల్సి ఉంటుంది.
దరఖాస్తులో లబ్ధిదారుడి పేరు, తండ్రిపేరు, వయస్సు, కులం, వృత్తి, చిరునామా, సొంత స్థలం వివరాలు, ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు, వితంతువు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, కుటుంబ వార్షికాదాయం, గతంలో కుటుంబంలో ఎవరైన ప్రభుత్వ పథకం ద్వారా ఏదైనా లబ్ధి పొంది ఉన్నట్లయితే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలి. ఇంటి స్థలం పొందిన పద్ధతి సూచించాల్సి ఉంటుంది. గృహలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన పేదలు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆన్లైన్ సెంటర్ల వద్ద బారులు ..
భైంసా, ఆగస్టు 8 : గృహలక్ష్మి పథకానికి ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, పట్టణంలోని మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయంలో ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారులు క్యూలో నిలబడి తీసుకుంటున్నారు. దీంతో తహసీల్ కార్యాలయం, ఆన్లైన్ సెంటర్ల వద్ద బారులు తీరారు.