కాగజ్నగర్, అక్టోబర్ 26 : కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానలో వరంగల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హేమలత శనివారం తనిఖీలు నిర్వహించారు. కాగజ్నగర్ ఈఎస్ఐ దవాఖానకు చెందిన మందులను కరీంనగర్లో ఓ ఫార్మసిస్టు విక్రయిస్తూ పట్టుబడిన కేసు విషయమై విచారణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. మందుల నిల్వ, వినియోగం, రికార్డులు తదితర వివరాలు సేకరించి ఆ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఆమె వెంట ఈఎస్ఐ దవాఖాన సూపరింటెండెంట్ జగన్, ఈఎస్ఐ వైద్య సిబ్బంది ఉన్నారు.
పాత భవనంలోవృథాగా మందులు..
కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖాన వెనుక భాగంలోని పాడుబడ్డ భవనంలో లక్షల రూపాయల విలువ చేసే మందులు వృథాగా ఉన్నాయి. 2020 సంవత్సరానికి కాలపరిమితి ముగిసిన ఈఎస్ఐకి చెందిన మందుల కాటన్లు ఉన్నాయి. ఈ విషయమై జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హేమలత దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న స్థానిక సిబ్బంది స్పందించి ఆ మందులు ఈ దవాఖానకు సంబంధించినవి కావని చెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఎస్ఐకి చెందిన లక్షల రూపాయల మందులు వినియోగించకుండా వృథా చేశారని విమర్శలు వస్తున్నాయి.