నస్పూర్, ఫిబ్రవరి 2 : నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియెట్, వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల కోసం 23 సెంటర్లకు గాను 10 ప్రభుత్వ, 8 ప్రైవేట్ కాలేజీలు, 5 సెక్టార్ కాలేజీలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల డీఐఈవో అంజయ్య పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తూ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం కాలేజీలకు రూ.10 వేలను ఇప్పటికే అందజేశారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. జిల్లాలో సెకండియర్ విద్యార్థులు 3852 మంది, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1930 మంది హాజరు కానున్నారు.