ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 28 : మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. శాంతికుమారి మాట్లాడుతూ ఇంటర్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 10 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.