మంచిర్యాల, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ కొడు తూ.. తెలంగాణ చరిత్రకు సమాధి కట్టాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నది. ఓరుగ ల్లు కేంద్రంగా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తి చిహ్నంగా ఉన్న కాకతీయ కళా తోర ణం, ఎందరినో బలి తీసుకున్న ప్రాణాంతకమైన ప్లేగు మహమ్మారి అంతమైనందుకు గుర్తుగా నిర్మించుకున్న చార్మినార్లను రాజముద్ర నుంచి తీసేయాలని తెలంగాణ ప్రభు త్వం ప్రయత్నిస్తున్నది. తెలంగాణ ఘనమైన చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే ఈ చిహ్నాలను రాజముద్ర నుంచి తొలగించడం సరికాదని, ఈ పనిచేసే ప్రభుత్వంపై యావత్ తెలంగాణ సమాజం తిరగబడక తప్పదని మేథావులు, చరిత్రకారులు ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు.
ఇక రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ పాటలోని చరణాల్లోనూ కాకతీయులు, గోల్కొండ ఆనవాళ్లు లేకుండా మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తున్నది. పైగా తెలంగాణలో సంగీత దర్శకులు ఎవరూ లేనట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడితో ఈ పాటను కంపోజ్ చేయించడంపై తెలంగాణ కళాకారులు, రచయితలు, సంగీత విద్వాంసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ప్రజలు, కళాకారులు, రచయితల మనోభావాలతో ఆడుకంటూ రాజముద్రను మార్చడం, రాష్ట్ర గీతంలో మార్పులు చేయడం, ప్రాంతియేతరులకు సంగీత బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.