ఆసిఫాబాద్ జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత వేధిస్తున్నది. తమకు కావాల్సిన ఎరువుల బ్యాగుల కోసం పీఎసీఎస్ కేంద్రాల వద్ద నిత్యం బారులు తీరాల్సి వస్తున్నది. ఉదయం ఏడింటికే కేంద్రాల వద్దకు చేరుకొని గంటల తరబడి పడిగాపులుకాయాల్సిన దుస్థితి నెలకొంది. ఎకరాలతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికీ ఒకటీ.. రెండు బ్యాగులకు మించి ఇవ్వకపోవడంతో.. అవి ఎటూ సరిపోక వారంతా ఆందోళనకు గురికావాల్సి వస్తున్నది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ)
పక్కదారి పట్టించి.. అధిక ధరలకు విక్రయించి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ రైతుల అవసరానికి తగ్గట్లుగా యూరియాను అందుబాటులో ఉంచడంలో విఫలమవుతున్నారు. జిల్లాలో 18 ఆగ్రోసెంటర్లు, డీసీఎంఎస్ సెంటర్లు 25, పీఏసీఎస్‌లు 12, హాకా కేంద్రాలు 12, రైతు ఫార్మర్ సొసైటీలు 4 ఉన్నాయి.
ఇప్పటి వరకు సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరినట్లు తెలుస్తోంది. రైతులకు సబ్సిడీపై యూరియా అందించే హాకా కేంద్రాల నిర్వాహకులే ఫర్టిలైజర్స్ షాపుల యజమానులు కావడంతో జిల్లాకు వచ్చిన మెజార్టీ సబ్సిడీ యూరియా ఫర్టిలైజర్ దుకాణాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతులకు సబ్సిడీపై యూరియా అందించే ఆగ్రో సెంటర్స్, డీసీఎంఎస్, పీఏసీఎస్, రైతు ఫార్మర్ సొసైటీల్లో రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
అందుబాటులో లేక అవస్థలు
జిల్లాలో సాగవుతున్న పంటలకు సరిపడా యూరియా తెప్పించడంలో అధికారులు విఫలమయ్యారు. జూలై వరకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని గతంలో ప్రకటించిన అధికారులు ఆగస్టులో రైతులకు కావాల్సిన ఎరువులను అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. జూలై నాటికి 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, జూలై వరకు యూరియా కొతర లేదని, రైతుల అవసరానికి తగ్గట్టుగా నిలువలు ఉన్నాయని ప్రకటించిన వ్యవసాయ అధికారులు ఆగస్టులో రైతులకు కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచలేక పోయారు. జిల్లాలోని చాలా కేంద్రాల్లో యూరియా అందుబాటులో లేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాల్లో రైతులు బారులు తీరి గంటల తరబడి నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నారు.
ఒక్కో రైతుకు ఒకటీ.. రెండు బస్తాలే..
యూరియా కోసం కేంద్రాలకు వచ్చే రైతులకు ఎన్ని ఎకరాల సాగుభూమి ఉంది.. యూరియా ఎంత అవసరముందనే విషయాలేవీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక్కో పట్టాపాస్ బుక్కు ఒకటీ.. రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారు. ఎకరమున్న రైతులకు ఒక యూరియా బ్యాగు.. అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారు. అధికారులు అందించే రెండు బస్తాల యూరియా రైతులకు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గత్యంతరం లేక ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులకు కావాల్సిన సబ్సిడీ యూరియాను అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమవుతున్నారు.
వర్షంలోనూ బారులు
దహెగాం, ఆగస్టు 11 : దహెగాం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలుసుకున్న రైతులు ఉదయం ఏడింటి నుంచే బారులు తీరారు. మధ్యాహ్నం వర్షం పడగా, తడుస్తూనే క్యూలో ఉండి కూపన్లు తీసుకున్నారు. మండల కేంద్రానికి 30 కిలో మీటర్ల దూరంలోనున్న మొట్లగూడ, రాంపూర్, ఖర్జీ, గిరివెల్లి, తదితర గ్రామా లనుంచి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి అవస్థలు పడ్డారు. కాగా, రెండు లారీల లోడు(800 బస్తాలు) వస్తే తలా రెండుమూడే పంపిణీ చేశారు.