యేటా నాసిరకం విత్తనాలు మార్కెట్లను ముంచెత్తుతుండగా, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. గత వానకాలం సీజన్లో నెన్నెల మండలంలోని పలు గ్రామాల్లో వేసిన ఓ కంపెనీ వరి సీడ్స్ రెండు నెలలకే పొట్ట దశకు రాగా, అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. పొలమంతా ఒకేసారి కాకుండా అక్కడక్కడా ఈనగా (వరి కంకులు), దిగుబడి రాదేమోనన్న భయం వారిని వెంటాడుతున్నది.
మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నెన్నెల, అక్టోబర్ 15 : మంచిర్యాల జిల్లాలో 1,60,065 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. కొన్ని వేల ఎకరాల్లో సన్నరకాలు వేశారు. విత్తనాలను బట్టి 130 రోజుల నుంచి 155 రోజుల వ్యవధిలో పంట కాలం పూర్తవుతుంది. జై శ్రీరాంవంటి వాటికి దాదాపు 150 రోజులు పడుతుంది. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు జూలై చివరి మా సం నుంచి ఆగస్టు చివరి వరకు నాట్లు వేశారు.
కాకపోతే రైతులు చెబుతున్న ఓ కంపెనీ విత్తనాలు వేసిన నెల రో జుల నుంచే పొట్ట దశకు రావడం మొదలైంది. 60 రోజు ల వ్యవధిలో దాదాపు 15 శాతం పంట పొట్టకు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన 85 శాతం పొట్టకు రాలేదు. దీంతో మొదట ఈని బయటికి వచ్చిన కంకులు ఎండిపోయి కిందపడి పోతాయని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పూర్తిగా కోతకు వచ్చే సరికి ఇప్పుడు పొట్టకు వచ్చిన కంకి నేలపాలవుతుందని వాపోతున్నారు.
ఎకరానికి దాదాపు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల నష్టం వచ్చే అవకాశముందని చెబుతున్నారు. సాధారణంగా పొలం అంతా ఒకేసారి పొట్టకు వస్తుంది. కోతలు కూడా ఒకేసారి చేస్తామని, అలాంటప్పుడు కొంతమేరకే వచ్చిన పంటను ఎలా కోసేదని పేర్కొంటున్నారు. నెన్నెల మండలంలో దాదాపు 600 ఎకరాల్లో వరిసాగు చేశామంటున్నారు. ఏ పొలం చూసినా ఇదే తీరు కనిపిస్తుందని వాపోతున్నారు. విత్తనాలు అమ్మిన డీలర్లను రైతులు అడిగితే సంబంధిత కంపెనీ వాళ్లకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చి పంటను పరిశీలిస్తారంటున్నారని, కానీ ఇప్పటి వరకు ఎవరూ వచ్చింది లేదని మండిపడుతున్నారు.
విత్తనాల్లో మాయాజాలం
రైతులు ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు తయారుచేసే కంపెనీల నుంచి వచ్చే విత్తనాల్లో తేడాలుంటున్నాయని డీలర్లు చెబుతున్నారు. సమస్య వస్తే ఆ కంపెనీకి చెందిన విత్తనం వేసిన ప్రతిచోటా రావాలి. కానీ కొందరు రైతులకు వస్తుందంటే దానికి కారణం ప్రయోగం కోసం సిద్ధం చేసిన విత్తనాలను ప్యాక్ చేసి మార్కెట్లోకి వదలడమే అంటున్నారు.
కాకపోతే ఇప్పు డు నెన్నెల మండల రైతులు చెబుతున్న కంపెనీకి సంబంధించిన విత్తనాలపై చాలా మంది రైతులు ఇదే తరహా ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత కంపెనీ దృష్టికి తీసుకెళ్లామంటున్నారు. కాకపోతే ఆ కంపెనీ నుంచి మీరు కొనుగోలు చేసినట్లు ఏదై నా పత్రం ఇచ్చారా అంటే మాత్రం డీలర్లు సమాధానం చెప్పడం లేదు. విత్తనం ఒరిజినలైతే పత్రం ఇవ్వడానికి, కంపెనీ ప్యాకింగ్‌ను చూపించడానికి సమస్య ఏమిటని అడిగితే.. కంపెనీ వారే వచ్చి రైతులను కలుస్తారని, సమస్యను పరిష్కరిస్తారని చెబుతూ దాటవేస్తున్నారు.
బెల్లంపల్లిలోని ఓ ఆగ్రోస్ నుంచి ఈ విత్తనాలు నెన్నెల మండ ల రైతులకు అందజేశారు. ఈ విషయపై ఆగ్రోస్ నిర్వాహకులను ఫోన్లో సంప్రదించగా సరైన సమాధానం రాలేదు. కంపెనీ ఏజెంట్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన కూడా సమాధానం ఇవ్వలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి, నాసిరకం విత్తనాలతో నష్టపోయిన వారికి సంబంధిత కంపెనీ నుంచి పరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై మండల వ్యవసాయ అధికారిణి కిరణ్మయిని సంప్రదించగా అక్కడక్కడా వరి పంట సక్రమంగా రావడంలేదని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిపై క్షేత్రాలను సందర్శించి విచారణ చేస్తామన్నారు. నాసిరకం విత్తనాలు అని తేలితే చట్టప్రకారం కఠిన చర్యల తీసుకుంటామని చెప్పారు.
నాసిరకం విత్తనాలతోనే పంట దెబ్బతింది
ఓ కంపెనీ విత్తనాలు మంచివని నమ్మి పంట సాగు చేస్తే రెండు నెలలకే పొలం అక్కడక్కడా ఈనింది. కనీసం 90 రోజుల వరకు పొట్టకు రావాలి. ఇప్పుడు 60 రోజులకే గొలుసులు బయటికి వచ్చినయి. ఇప్పుడు ఈనిన కంకి పొలం కోత వరకు ఉండదు. నాసి రకం విత్తనాల వల్లే ఇలా జరిగింది. కంపెనీ వాళ్లు వచ్చి న్యాయం చేయాలి. లేదంటే ఆందోళనలకు దిగుతాం. – తోట మధు, రైతు, నెన్నెల