ఇచ్చోడ, సెప్టెంబర్ 17 : ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ముస్లే నందుబాయి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ విషయం వారికి తెలియకుండా అదే పేరు గల మరొకరు ముస్లే నందుబాయి-మారుతితో పంచాయతీ కార్యదర్శి సునిల్ నాయక్ కుమ్మ క్కై ఇంటి నిర్మాణం చేయించాడు. మొద టి దశ నిర్మాణం కాగానే అసలైనా లబ్ధిదారు ముస్లే నందుబాయి అకౌంట్లో రూ.లక్ష డబ్బులు జమ అయ్యాయి. ఈ డబ్బులను ముస్లే నందుబాయి-మారుతి ఖాతాలోకి బదిలీ చేయించారు.
విషయం అసలు లబ్ధిదారుకు తెలియడంతో పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. ఈ లక్ష రూపాయలను ఐదు రోజుల్లో చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు. ఇప్పుడు డబ్బులు అడిగితే ఎవ్వరికైనా చెప్పుకోండి అని బదులు ఇస్తున్నాడు. ఈ విషయంపై ఎంపీడీవో సత్యానంద్‌ను వివరణ కోరగా.. ఒకరి పేరిట మంజూరైన ఇల్లును మరొకరు నిర్మించుకున్నారనే విషయం వాస్తవమేనని తెలిపారు. ఇద్దరి పేరు ఒకటే కావడంతో తప్పిదం జరిగిందని, ఈ విషయం కలెక్టర్ కార్యాలయం వివరణ కోరిందని, విచారణ జరిపించి నివేదికను అందజేస్తామని తెలిపారు.