మంచిర్యాల, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ‘ఇందిరమ్మ కమిటీల’ ఏర్పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. పేదలకు ఇండ్లు సమకూర్చడంతోపాటు సంక్షేమ పథకాల అమలుకు మండలాలు, పట్టణాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ నెల 12లోగా కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ కమిటీల వ్యవహారం కొలిక్కి రాలేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఖానాపూర్లో దాదాపు కమిటీలు ఫైనల్ అయ్యాయి.
బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కమిటీల విషయంలో క్లారిటీ రాలేదని తెలుస్తున్నది. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోజకవర్గాల్లో కమిటీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఒక లిస్టు ఇవ్వగా.. స్థానిక అధికార పార్టీ లీడర్లు మరో లిస్టు ఇచ్చినట్లు సమాచారం. కమిటీల్లో ఇలా రాజకీయ జోక్యం, ఒత్తిడి పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీలలో ప్రతిపాదించిన వారి పేర్లను సంబంధిత మండలాల ఎంపీడీవోలు, మున్సిపాలిటీల కమిషనర్లు కలెక్టర్కు ఇవ్వాలి. కలెక్టర్ ఇచ్చే జాబితాలో నుంచి సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రి కమిటీలను ఫైనల్ చేస్తారు.
అసంతృప్తిలో సీనియర్లు.. నిరసనలకు దిగే చాన్స్..
నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేదా జీపీ స్పెషల్ ఆఫీసర్ చైర్మన్గా, మున్సిపాలిటీలలో వార్డు కౌన్సిలర్ ఇందిరమ్మ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వార్డు/డివిజన్ అధికారి కమిటీల కన్వీనర్లుగా ఉంటారు. ఇద్దరు స్వయం సహాయక సంఘాల మహిళలతోపాటు ముగ్గురు స్థానికులు సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యుల విషయంలోనే ఇప్పుడు వివాదాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నాయకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కమిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లను కాదని, ఈ మధ్య కాలంలో ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వారికి అవకాశం ఇచ్చారనే అసంతృప్తి రగులుతోంది. తమను పక్కన పెట్టడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
ప్రస్తుతం ఎవరూ బయట పడనప్పటికీ ఇన్చార్జి మంత్రి కమిటీలను ఫైనల్ చేశాక.. మా పేర్లు రాకపోతే నిరసనలకు దిగుతాం అంటూ కొందరు కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో సీనియర్లకు చాన్స్ రాలేదని, కమిటీలు ఫైనలయ్యాక అంతా కలిసి నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నామని అధికార పార్టీ నాయకులు ఒకరు చెప్పారు. ఇక చెన్నూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీల కోసం ఎమ్మెల్యే వివేక్ ఒక లిస్ట్ ఇవ్వగా, ఆయన పీఏ మరో లిస్టును అధికారులకు ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులే స్వయంగా చెప్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన మా పేర్లు కమిటీల్లో లేకపోతే మంచిగా ఉండదంటూ చెన్నూర్ నియోజకవర్గంలో పలువురు నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ కమిటీలు అధికార పార్టీకి కొత్త తలనొప్పి తీసుకురానున్నా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక కష్టమే..
ఇండ్ల నిర్మాణం కోసం రూ.ఐదు లక్షల చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మందిని మొదటిదశ లో ఎంపిక చేయాలని ప్రభ్తుత్వం నిర్ణయించింది. అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్థానికులను భాగస్వాములను చేస్తూ ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో మాత్రం కమిటీల్లో ఉండాల్సిన స్థానికుల స్థానంలో కాంగ్రెస్ లీడర్లే ఎక్కువ మంది ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అర్హులైన పేదలకు బదులు, అధికార పార్టీ లీడర్లు, స్థానిక కార్యకర్తలను ఎంపిక చేస్తే పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. అదే జరిగితే పేదలకు చేయూత నివ్వాలనే పథక లక్ష్యం నిరుగారిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇందిరమ్మ కమిటీల్లో పారదర్శకతపై స్పష్టత ఏం ఇస్తుందన్న్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.