మంచిర్యాల, మే 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి లేదా ఇందిరమ్మ కమిటీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, డబ్బులు ఇచ్చినోళ్లే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపిక అవుతున్నారు.
ఈ రెండు ఉదాహరణలే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా రోజు ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులు, కాంగ్రెస్ లీడర్లను ఎంపిక చేశారంటూ ప్రజలు తిరగబడుతున్నారు. గ్రామాల్లోకి సర్వేలు, సభలకు వెళ్లిన అధికారులను నిలదీస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ తరహా నిలదీతలు, నిరసనలు ఎక్కువైపోయాయి. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంతోపాటు కాసిపేట మండలంలోని లంబాడీతండా(ధర్మారావుపేట్) గ్రామంలో సోమవారం గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులే ఎంపికైన లబ్ధిదారుల్లో ఉన్నారంటూ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏం లేక అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చెన్నూర్ నియోజకవర్గంలో సుద్దాల, కిష్టంపేట, ఎల్లక్కపేటతోపాటు ఎర్రగుంటపల్లి గ్రామస్తులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులనే ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ గజానంద్, రాథోడ్ యశ్వంత్‌రావు అనే వికలాంగులు పోయిన వారం ఎంపీడీవో ఆఫీసు ఎదుట భైఠాయించారు. అన్ని రకాలుగా అర్హులుగా ఉన్న తమను ఎందుకు ఎంపిక చేయలేదంటూ నిరసన తెలిపారు.
అనంతరం కార్యాలయ సిబ్బందిని వినతి పత్రం ఇచ్చి వెళ్లారు. బెజ్జూర్ మండలంలోని సారంగపల్లి, సలుగుపల్లి గ్రామస్తులు అనర్హులను ఎంపిక చేశారంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట, రోడ్డుపై ధర్నా చేశారు. పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు తాము ఉంటున్న గుడిసెలు, తాత్కాలిక ఇండ్లను చూపిస్తూ.. మమ్ములను ఎందుకు ఎంపిక చేయలేదంటూ నిలదీస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని
పేద యువకుడి ఆత్మహత్యాయత్నం
కోటపల్లి, మే 1 : ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా నుంచి కాంగ్రెస్ నాయకులు, అధికారులు తన పేరును తొలగించి అన్యాయం చేశారని మనస్తాపంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్ బుధవారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి, ఆర్థికంగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారని రవీందర్ ఆరోపించాడు. నిరుపేదలమైన తమకు అన్యాయం చేశారని వాపోయాడు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ఇందులో 2,941 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇండ్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు వేరే దగ్గరున్న ఖాళీ స్థలాలు చూపిస్తూ ఇండ్లు లేని వారీగా దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల జాబితాల్లో ఇండ్లు లేని పేదలకు బదులు ఇండ్లు ఉన్న కాంగ్రెస్ లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు రావడం స్థానికంగా దుమారం రేపుతోంది.
ఓ వార్డుకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి సహా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం దుర్గా ప్రసాద్ పేరు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాలో ఉండడంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. జనం నుంచి విమర్శలు రావడంతో ఈ ఇద్దరూ జాబితాలో నుంచి తమ పేర్లను తొలగించాలంటూ బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. లబ్ధిదారుల జాబితాలో చాలా మంది కాంగ్రెస్ లీడర్ల పేర్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకులకే ఇండ్లు ఇచ్చుకునేట్లు ఉంటే.. తమ నుంచి దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్లు అని మండిపడుతున్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలోని సుద్దాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఆధ్వర్యంలో 42 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలు 300 మంది ఉంటే వారెవనికి కాకుండా ఇప్పటికే ఇండ్లు ఉన్న వారిని ఎంపిక చేశారంటూ గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిని గ్రామసభలో నిలదీశారు. కిష్టంపేట గ్రామంలో 1100 దరఖాస్తులు రాగా, తమకు అనుకూలంగా ఉన్న 70 మందినే ఎంపిక చేశారు. ఎల్లక్కపేటలో 70 దరఖాస్తులు రాగా కేవలం నలుగురిని ఎంపిక చేశారు. దీనిపై ఎల్లక్కపేట కాలనీ వాసులు రోడ్డుపై ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నోళ్లకు, డబ్బులు ఇచ్చినోళ్లకే ఇండ్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూరి గుడిసెలో ఉంటున్నా..
పూరి గుడిసెలో ఉండే నన్ను ఇందిరమ్మ ఇల్లుకు ఎంపిక చేయలేదు. ముందు ఇందిరమ్మ లిస్టులో పేరు వచ్చింది. ఇప్పుడేమో లిస్టులో నా పేరు తీసేశారు. అడిగితే నువ్వు అర్హుడివి కాదు అంటున్నారు. పూరి గుడిసెలో ఉంటూ కూలీ చేసుకుని బతికే నేను ఎందుకు అర్హుడిని కాదు. నాకు ఇండ్లు మంజూరు చేయకపోవడం దారుణం. ఇప్పటికే ఇల్లు ఉన్న వాళ్లకే ఇల్లు మంజూరు చేస్తున్నారు. పాత ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్లను కూడా మరోసారి ఎంపిక చేశారు. అర్హులైన నిరుపేదలైన మా వంటి పూరి గుడిసెల్లో ఉండే పేదలకు ఇండ్లు ఇవ్వాలి. సర్వే చేసి నిజమైన అర్హులను గుర్తించాలి.
– హట్కర్ రాజు, ధర్మారావుపేట, కాసిపేట
రేకుల షెడ్డులో ఉంటున్న ఇల్లు లేదు
మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ కడుపు నింపుకోలేను. కూలీ నాలీ చేసి సంపాదించిన కొద్ది పాటి సొమ్ముతో రేకుల షెడ్డు వేసుకున్నా. అలాంటి నన్ను ఇందిరమ్మ ఇంటి కోసం ఎంపిక చేయలేదు. గతంలో ఇల్లు ఇచ్చినోళ్లకే మరోసారి ఇల్లు ఇస్తున్నరు. ఇది ఎక్కడి న్యాయమో అర్థం అయితలేదు. మా ఊరిలో ఎవ్వరిని అడిగిన చెప్తరు. ఇందిరమ్మ ఇల్లును నేను పూర్తి అర్హురాలిని అని. కావాలంటే మరోసారి సర్వే చేసైనా సరే నన్ను ఎంపిక చేయాలి.
– భూక్య సమత, ధర్మారావుపేట, కాసిపేట
నిరుపేదలం మాకు ఇయ్యలే..
మాది ఎర్రగుంటపల్లి గ్రామం. మాకంటూ సొంత ఇల్లు లేదు. ఊరిలో ఇల్లు ఉన్న వారినే ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్లకు, వారి బంధువులకే ఇండ్లు రాస్తున్నారు. మాకు భూములు లేవు. మా తాతలు కట్టిన పాత ఇంట్లో ఉంటున్నాం. గోడలు కూలిపోడానికి సిద్ధంగా ఉన్నాయి. మాది నిరుపేద కుటుంబం. కష్టం చేసి బతికేటోళ్లం. ఉన్న రోజు కూలీ పనులకు పోతం. లేని రోజు పస్తులు ఉంటం. తప్పని సరి పరిస్థితి వస్తే అప్పులు చేసి అవసరం తీర్చుకుంటం. మేం ఇద్దరం ఆడపిల్లలమే. మా నాన్నకు మా పెళ్లిళ్లు చేయడం కూడా పెద్ద భారమే. ఇల్లు సక్కగా లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కొంచెం అప్పు చేసైనా ఇల్లు కుట్టుకుంటం. ప్రభుత్వం మా వంటి పేదలకు ఇండ్లు ఇయ్యాలి.
– సాగే సమ్మక్క, ఎర్రగుంటపల్లి, చెన్నూర్.