దిలావర్పూర్, ఆగస్టు 24 : సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాకు మొదటి విడుతలో 8,286 ఇండ్లు నిర్మించుకోవడానికి సర్కారు అనుమతులు ఇచ్చింది. కానీ.. నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఏకంగా ఇందిరమ్మ ఇల్లు వద్దని వివిధ కారణాలతో 1286 మంది అధికారులకు అర్జీలు కూడా పెట్టుకోవడం విశేషం.
నిర్మల్ నియోజకవర్గానికి 3500, ముథోల్ నియోజకవర్గానికి 3500, ఖానాపూర్ నియోజకవర్గానికి 1505 ఇళ్లను కేటాయించింది. దరఖాస్తులను ఆహ్వానించగా 1,89,292 మంది అర్జీలు పెట్టుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హులుగా 77,270 మందిని గుర్తించారు. మరో 72,100 మంది ఇండ్లు కట్టుకోవడానికి స్థలం ఉందని, 39,922 మంది ఇండ్లు కట్టుకోవడానికి స్థలం లేదని దరఖాస్తు పెట్టుకున్నారు.
8,286 ఇండ్లు మంజూరు
నిర్మల్ జిల్లాకు మొదటి విడుతలో 8,286 ఇండ్లు నిర్మించుకోవడానికి సర్కారు అనుమతులు ఇచ్చింది. కానీ.. నిర్మాణానికి లబ్ధిదారు లు ముందుకు రావడం లేదు. నిర్మాణానికి ఐ కేపీ ద్వారా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తున్నా కట్టుకోవడం లేదు. గ త జూలై 27వ తేదీ వరకు ఇండ్లు నిర్మించుకోవడానికి 5,315 మంది ముందుకొచ్చారు. ఇందులో 4,916 మంది ముగ్గు పోశారు.
ఇళ్లు వద్దని 1286 మంది అర్జీలు
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 1,286 మంది మంజూరైన ఇండ్లను రద్దు చేయాలని అధికారులకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. వద్దని చెప్పిన వారి నుంచి లిఖిత పూర్వంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం కట్టుకోవడానికి సరైన సమయం కాదని వివరించారు. మిగతా 449 మంది వివిధ కారణలతో రద్దు చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి సరిపోకపోవడం, సిమెంట్, ఇటుక, కంకర, ఇతర వస్తువుల ధరలు పెరగడంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.
మొండిగోడలే మోడల్
కాంగ్రెస్ సర్కారు ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టింది. ఈ నమూనా మాదిరిగా ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలనే ఉద్దేశం నీరుగారుతున్నది. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో మూడు నెలల క్రితం అధికారులు, ప్రజాప్రతినిధులు మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండు నెలల తర్వాత పనులు మొదలయ్యాయి. నెల రోజుల్లో గోడల వరకు పూర్తయింది. ఈ నిర్మాణానికి మొదటి విడుతలో రూ. ఒక లక్ష మంజూరయ్యాయి. ఇంకా రూ. ఒక లక్ష రావాల్సి ఉంది. మిగతా నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ విషయమై.. ఎంపీడీవో అరుణరాణిని వివరణ కోరగా.. నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ శాఖ ఏఈకి అప్పగించాం. చిన్న చిన్న సమస్యలతో పనులు నిలిచి పోయాయి. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తాం.
– దిలావర్పూర్, ఆగస్టు 24