రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఆరోగ్య కేంద్రాలు.. అమ్మతనానికి నిలయాలుగా మారాయి. సుఖ ప్రసవాలు.., మెరుగైన ఉచిత వైద్య సేవలు.., కేసీఆర్ కిట్.., ఆర్థిక సాయంతో దేవాలయాలుగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రసవాల సంఖ్య పెంచుకుంటూ.. ఉత్తమ సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ.., గర్భిణుల ఆలనాపాలనా చూస్తుండడంతో ఇంటి ప్రసవాలు తగ్గి.. దవాఖాన ప్రసవాలు పెరిగాయి. బేల పీహెచ్సీలో నెలకు 15 నుంచి 30 ప్రసవాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనే మూడోస్థానంలో నిలిచింది.
– బేల, డిసెంబర్ 7
మండలంలోని బేలతో పాటు సైద్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో బేల, దహిగావ్, సిర్సన్న, సాంగిడి, చెప్రాల ఉప కేంద్రాలున్నాయి. ఇక్కడి గర్భిణులు ప్రసవాలు పొందేందుకు బేల దవాఖానకే వస్తున్నారు. గతంలో ఇక్కడ వైద్యం చేయించుకునేందుకు మహిళలు భయపడేవారు. అపరిశుభ్ర పరిసరాలు, అందుబాటులో లేని వైద్యులతో ప్రజలు విసిగి వేసారి ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చుచేసుకునేవారు. తెలంగాణ రాష్ట్ర తీసుకొచ్చిన మార్పుతో ప్రత్యేకంగా గర్భిణులు ఇక్కడికి వరుస కడుతున్నారు. మండలంలో అత్యధికంగా గిరిజనులు, పేదలు ఎక్కువగా ఉండగా, వారికి అండగా ఉంటూ వైద్యులు విశేష సేవలందిస్తున్నారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నమ్మకం కలిగేలా వైద్యసేవలు అందించడంతో క్రమంగా ప్రసవాలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం పొందిన తల్లీబిడ్డకు కేసీఆర్ కిట్ అందించడంతో పాటు పుట్టిన బిడ్డకు నగదు అందుతున్నది.
నెలకు 15 నుంచి 30 ప్రసవాలు..
ఇక్కడి పీహెచ్సీలో నెలకు 15 నుంచి 30 మంది ప్రసవం పొందుతుండడం వైద్యుల పనితీరుకు నిదర్శనం. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలోని గర్భిణులకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది విస్తృత సేవలందిస్తున్నారు. గతంలో ఉన్న ఆరోగ్య కేంద్ర భవనం శిథిలావ్యవస్థకు చేరడంతో మండల కేంద్రంలోని పద్మావతి మండల సమాఖ్య భవనంలో తాత్కాలికంగా ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ కలెక్టర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో ల్యాబ్, బేబీ వార్మర్, సిట్టింగ్ రూం.. ఇలా పలు తాత్కాలిక గదుల ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే గర్భిణుల కోసం ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయడంతో మారుమూల గిరిజన గ్రామాల గర్భిణులు పీహెచ్సీ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. గర్భిణులకు ప్రత్యేకంగా ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీతో పాటు అన్ని ఉప కేంద్రాల్లో ఈ కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతున్నది.
ఆదర్శం ఇక్కడి సిబ్బంది..
దవాఖానలో ప్రసవాలు రాత్రివేళల్లో అత్యధికంగా జరుగుతున్నాయి. బేల ఆరోగ్య కేంద్రంలో నాలుగురు స్టాఫ్ నర్సులు విధుల్లో ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు ప్రతి రోజూ రాత్రి ప్రసవాలకు వచ్చే వారితో ప్రేమపూర్వకంగా మెదిలి, వైద్యంతో భయాన్ని దూరం చేస్తున్నారు. మాతృమూర్తికి ఎలాంటి ఇబ్బందిరాకుండా ప్రసవం జరిగేలా చేస్తున్నారు. దాంతో బేల హీహెచ్సీలో అత్యధికంగా నవంబర్‌లో 32 ప్రసవాలు జరిగి, జిల్లాలోనే 3వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా నిలిచింది.
ప్రసవాలు పెరగడం శుభపరిణామం..
కార్పొరేట్ దవాఖానల కంటే నాణ్యమైన వైద్యం అందించడమే మా లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య కేంద్రంలో సేవలు మెరుగుపడ్డయ్. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో నెలకు 15 నుంచి 30 ప్రసవాలు జరుగుతున్నాయి. ఇంటి ప్రసవాలు సంఖ్య దాదాపు తగ్గిపోయింది. సిబ్బంది పనితీరు వల్లే మెరుగైన వైద్యం అందించగలుగుతున్నం.
– క్రాంతి కుమార్ ఇన్చార్జి వైద్యుడు, బేల పీహెచ్సీ
మంచి సౌకర్యాలున్నాయి..
బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరిగే సమయంలో చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ స్టాఫ్ నర్సులు చిన్న పిల్లలుగా ప్రేమపూర్వక వైద్యంతో భయాన్ని దూరం చేస్తారు. పుట్టిన బిడ్డను తల్లినీ కంటికి రెప్పలా కాపాడుతారు. ప్రతి రోజూ చికిత్స నిర్వహిస్తారు. పైసా ఖర్చు లేకుండా పూర్తిగా ప్రసవాలు చేస్తారు. ప్రైవేటు దవాఖాన కంటే ఇక్కడే మంచి వైద్యం అందిస్తూ వంద శాతం సాధారణ ప్రసవాలే చేస్తారు.
– హీన, భవానీగూడ
పైసా ఖర్చు లేకుండా..
పురిటి నొప్పులు రావడంతో మా వాళ్లు 102 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వెంటనే ఆ వాహనం వచ్చి, బేల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. నవంబర్ 28న రాత్రి 12:20 గంటలకు నాకు బిడ్డ పుట్టింది. వారం తర్వాత డిశ్చార్చి చేశారు. మళ్లీ 102 అంబులెన్స్‌లోనే క్షేమంగా తీసుకొచ్చి, మా ఇంటికాడ దించిన్రు. పైసా ఖర్చు లేకుండా సకాలంలో స్పందించి, దవాఖానలో చేర్పిచడం వల్ల నేనూ నా బిడ్డ మంచిగున్నం.
– కొడప అయ్యుబాయి, గణేశ్‌పూర్
దవాఖానల్లోనే సుఖ ప్రసవాలు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లోనే సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెలా 102 వాహనంలో చికిత్స కోసం తీసుకెళ్లడమే కాకుండా వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్రసవం జరిగి ఇంటికి వెళ్లే సమయంలో కేసీఆర్ కిట్ ఇస్తున్నరు. మళ్లీ అదే వాహనంలో ఇంటికి క్షేమంగా తీసుకెళ్తున్నరు. ప్రభుత్వ దవాఖానల్లోనే సుఖ ప్రసవాలు ఎక్కువగా చేస్తున్నరు. – సరుబాయి, చప్రాల గ్రామం