నమస్తే నెట్వర్క్, జూలై 27 : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకొని, ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మంచిర్యాల పట్టణంలోని సీతారామకాలనీ, బృందావన్ కాలనీ, సాయికుంట, హమాలీవాడ, తిలక్‌నగర్, శ్రీశ్రీనగర్, గర్మిళ్ల, పాతమంచిర్యాల, పద్మశాలీ కాలనీ, రంగంపేట, వికాస్‌నగర్, జన్మభూమినగర్, గౌతమీనగర్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద వచ్చిచేరగా, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
మంచిర్యాల వద్ద రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు, అమరవీరుల స్తూపం నుంచి రంగంపేట వైపుకు రాళ్లవాగుపై నిర్మించిన కాజ్వే పై నుంచి వరద ప్రవహిస్తుండగా, రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూర్ పట్టణంలోని రహదారులు చిత్తడిగా మారాయి. శిథిలావస్థకు చేరిన ఇళ్లను మున్సిపాలిటీ కమిషనర్ గంగాధర్ పరిశీలించారు.
చెన్నూర్ మండలంలోని కత్తరశాల వాగులో జోరుగా ప్రవహిస్తుండగా, సంకారం, బుద్ధ్దారం, కన్నెపల్లి గ్రామాల్లోని రహదారుల మధ్య ఉన్న కల్వర్టులు పొంగిపొర్లుతున్నాయి. అక్కెపల్లి సమీపంలో ఉన్న కాజ్వే పైకి వరద వచ్చి అక్కెపల్లి, శివలింగాపూర్ గ్రామాలకు నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
చెన్నూర్ పట్టణంలోని ఆస్నాద్ రోడ్లో మినీ ట్యాంక్ బండ వద్ద రెండు గొర్రెలు ఇనుప కంచెకు తగలగా, విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాయి. జైపూర్ మండలంలోని మిట్టపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. టేకుమట్ల లో లెవల్ వంతెనపై నుంచి వరద పారుతుండగా, శెట్పల్లి, కుందారం, శివ్వారం గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడ జైపూర్ పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
కాసిపేట మండలం దేవాపూర్ సల్పాలవాగు ప్రవాహం ఆకట్టుకుంటున్నది. చుట్టూ ఎతైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం మధ్య గలగల పారుతూ కనువిందు చేస్తున్నది. కోటపల్లి మండలం నక్కలపల్లి లోతొర్రె, రాజారం గ్రామానికి వెళ్లేదారిలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తుండగా, నది తీరం వెంట ఉన్న పంట పొలాలు నీట మునిగిపోయాయి. లింగన్నపేట గ్రామానికి చెందిన తాడూరి శేఖర్‌కు చెందిన ఇల్లు కూలిపోయింది.
భీమారం మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీ జలమయం కావడంతో, స్థానికులు బానోత్ విద్యాసాగర్, దస్రు, శ్యాం, సాయి, శంకర్, రాజు, దేవెందర్ మోకాళ్ల లోతు నీటిలో నిరసన తెలిపారు. తమ కాలనీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం రోశయ్య, మద్దికల్ గ్రామానికి చెందిన చింతం బానక్కకు చెందిన ఇండ్ల గోడలు కూలిపోయాయి.
బెల్లంపల్లి పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టు ముందున్న పాత మున్సిపల్ కార్యాలయ భవనం శనివారం కూలిపోయింది. మున్సిపల్ అధికారులు సత్వరమే స్పందించి కూలిపోయిన గోడలను తొలగించాలని, మున్సిపల్ వాహనాలు, పరికరాలను ఇతర చోటికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. హాజీపూర్ మండలం గుడిపేట శివారులో గోదావరి నదిపై నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది.
శనివారం సాయంత్రం వరకు ప్రాజెక్టు క్రస్ట్ లెవల్ 148 మీటర్లకుగాను, 147.00కి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 17.3069 టీఎంసీలకు చేరుకున్నది. 21586 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, హైదరాబాద్ తాగునీటికి 331 క్యూసెక్కులు, నంది పంపు హౌస్ నుంచి 12,300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
దహెగాం మండలం కోత్మీర్ పంచాయతీ పరిధిలోని జెండాగూడకు వెళ్లే దారిలో గల రోరుమల్లి వాగులోకి వరద చేరడంతో పెండ్లి బృందం దాటేందుకు ఇబ్బందులు పడింది. మండల కేంద్రం నుంచి లగ్గాం వైపు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారగా, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పెంచికల్పేట్ మండలం ఉచ్చమల్లి వాగు, బొకి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, పరివాహక ప్రాంతాల పంటలు నీట మునిగాయి.