జైనథ్, జూలై 25 : మత సామరస్యానికి ప్రతిక మొహర్రం పండుగ అని, గ్రామాల్లోని ప్రజలు కుల, మాతలకు అతీతంగా జరుపుకుంటారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం పిప్పర్వాడ, ఆనంద్‌పూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సవారీ బంగ్లా షెడ్లను మంగళవారం స్థానికులతో కలిసి ఆయన రిబ్బన్ కట్‌చేసి, ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. సవర్ల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరారు. అలాగే గ్రామస్తులతో కలిసి అసైదులా అంటూ సంబురాల్లో పాల్గొని జోష్ నింపారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. ప్రజల కోరిక మేరకు సవారీ బంగ్లాలు, షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే దాదాపు 200 బంగ్లాల వద్ద షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మొదట రూ.కోటీ 90 లక్షలతో బంగ్లాలు, షెడ్లు నిర్మించగా, నేడు రూ.7 కోట్లతో సవారీ బంగ్లా షెడ్ల నిర్మాణాలు పూర్తిచేసుకోవడం జరిగిందన్నారు. మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచే మొహర్రం వేడుకలను గ్రామాలు, పట్టణాల్లో శాంతియుత వాతావరణంలో ఐక్యమత్యంగా జరుపుకోవాలని సూచించారు. పది రోజుల పాటు ఈ పండగను నియమనిష్టలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని తెలిపారు. ఇలాంటి సాంప్రదాయలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని స్పష్టం చేశారు. అలాగే మరింత వైభవంగా నిర్వహించుకునేలా తోడ్పాటునందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశ్‌రావు, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల ఆరుంధతి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తంయాదవ్, సర్పంచ్‌లు నోముల సంతోష్ రెడ్డి, రాధిక సాయినాథ్, ఎంపీటీసీలు ప్రశాంత్ రెడ్డి రాంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బూటకపు మాటలు నమ్మొద్దు..
ఎదులాపురం, జూలై 25 : దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే బీజేపీ, ప్రజా స్వామ్యాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల బూటకపు మాటలు నమ్మొద్దని ప్రజలకు ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. పట్టణంలోని 33వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హారయ్యారు. ముందుగా ఆయనకు స్థానికులు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. వార్డు పరిధిలో స్వయం సహకార సంఘ కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, లాంఛనంగా ప్రారంభించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతోపాటు వార్డులోని సవారీ బంగ్లా షెడ్‌ను స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసి కార్యక్రమంలో అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్ అలాల్ అజయ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, మైనార్టీ నాయకులు సలీంపాషా, అశోక్, లలిత తదితరులు పాల్గొన్నారు.