సీసీసీ నస్పూర్, నవంబర్ 2 : సీసీసీ నస్పూర్‌లో బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆటో డ్రైవర్ల మహాధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముకేష్‌గౌడ్, రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు మంద రవికుమార్, బీఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి నీలారపు రవి, రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, వివిధ ఆటో యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకం ద్వారా ఆటోడ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు, ఫైనాన్స్‌లు కట్టలేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.25 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, రూ. వెయ్యి కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు పైబడిన డ్రైవర్లకు పింఛన్ అందించాలన్నారు.
ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి రూ.5 లక్షల ప్రమాదబీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జేఏసీ అధ్యక్షుడు రేణుకుంట సురేశ్, కార్యదర్శి సదయ్య, మంచిర్యాల పట్టణ కార్యదర్శి బోరె వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి ఎండీ షఫీ, కోశాధికారి తగరపు శ్రీనివాస్, శ్రీరాంపూర్ గౌరవ అధ్యక్షుడు గోలేటి శివ, సీసీసీ కార్నర్ అధ్యక్షుడు రామన్న పాల్గొన్నారు.