మంచిర్యాల గ్రీన్‌సిటీలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మున్సిపాలిటీకి అప్పగించిన రోడ్లను సైతం ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తున్నారు. కార్మెల్ స్కూల్ నుంచి గ్రీన్‌సిటీకి వెళ్లే ైప్లె ఓవర్ గోడ పక్కనే రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కనే ఉన్న కొద్ది పాటి స్థలం(ఈ స్థలం లే-అవుట్ చేసినప్పుడు రోడ్డు కింద మున్సిపాలిటీకి అప్పగించారు)లో రెండు రూమ్‌లు నిర్మించేందుకు ఓ వ్యక్తి సిద్ధమయ్యాడు. గ్రీన్‌సిటీలో బట్టలు ఇస్త్రీ చేస్తూ, ఇండ్లలో పాచి పనులు చేసే వ్యక్తి కుటుంబానికి ైప్లె ఓవర్ గోడ పక్కన ఉన్న ల్యాండ్‌ను గ్రీన్‌సిటీలో ఉండే ఓ పెద్ద మనిషి విక్రయించినట్లు తెలిసింది.
సదరు వ్యక్తి తన ఊరిలో ఉన్న కొద్దిపాటి స్థిరాస్తులు విక్రయించి రూ.4 లక్షలు ఇచ్చికొన్నట్లు సమాచారం. ఆ స్థలంలో ముందు చిన్న టేలా పెట్టుకున్నాడు. ఆపై అదే స్థలం(మున్సిపాలిటీ)లో శనివారం ఉదయం రూమ్‌లు కడుతున్నారనే సమాచారమందుకున్న ‘నమస్తే తెలంగాణ’ అక్కడకి వెళ్లి ఫొటోలు తీసింది. అదే సమయంలో అక్కడికి టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం వచ్చారు.
విషయం తెలుసుకున్న పెద్ద మనిషి తనపైకి ఎక్కడ వస్తుందోనని సాయంత్రం నిర్మించిన పునాది నుంచి రాళ్లు తీసి రాళ్లవాగు ప్రహరీ పక్కన పెట్టేశారు. దీంతో ఆ బరువు తట్టుకోలేక రాళ్ల వాగు ప్రహరీ 30 మీటర్ల నుంచి 35 మీటర్ల వరకు కూలిపోయి.. వాగులో పడిపోయింది. దీంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రాకపోకలు సాగించే మార్గంలో ఇలా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.
అత్యాశకుపోయి రాళ్లవాగు ప్రహరీ కూలేందుకు కారణమైన వ్యక్తులపై మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది వేచి చూడాలి. ఉదయం ఈ అక్రమ కట్టడాన్ని పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకుందామని ‘నమస్తే తెలంగాణ’ వారిని సంప్రదించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. – మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్