భీమారం, మార్చి 18 : భీమారం, బూర్గుపల్లి, ఖాజీపల్లి, ధర్మారం, పోలంపల్లి శివారు ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా జేసీబీలతో తవ్వి మరీ ట్రాక్టర్లలో రవాణా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నది. అటవీశాఖ అనుమతి లేకుండా ఆయా ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇష్టారాజ్యంగా తోడుకెళ్తూ ఒక్కో ట్రిప్పునకు రూ. 2500 చొప్పున విక్రయిస్తున్నది. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతుందనే ప్రచారమున్నది. భీమారం గ్రామ పంచాయతీ పరిధిలో మూడు గ్రూప్ లు ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తున్నది.
గత నెల 25న భీమారం మండలం దాంపూర్ అటవీ ప్రాంతం నుంచి రాత్రి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారమందగా, అక్కడికి వెళ్లిన బీట్ అధికారి భానేశ్పై కొంతమంది అక్రమార్కులు దాడి చేయడం కలకలం రేపింది. మరుసటి రోజు (26వ తేదీ) స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. తమపై హత్యాయత్నం చేశారని, తాము నడుపుతున్న ద్విచక్ర వాహనంపై ఇసుక డంప్ చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు తెల్లవారు జామున భీమారం అటవీ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న జేసీబీతో పాటు ట్రాక్టర్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. మొత్తం 7 ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నట్లు తెలియగా, ఇందులో ట్రాక్టర్‌తో పాటు జేసీబీ మాత్రమే దొరికింది.
అంతకు ముందే అటవీశాఖలోని కొందరు అవినీతిపరులు ఇసుక మాఫియాకు ముందస్తు సమాచారం ఇచ్చారని, అందువల్లే మిగతా ట్రాక్టర్లు దొరకకుండా పోయాయని తెలిసింది. ఇక ఇటీవల ఇసుక తరలింపు విషయమై రెండు వర్గాల మధ్య ఘర్షణ కాగా, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఓ ట్రాక్టర్ యజమానిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా వర్గాల మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో ఓ పోలీసు అధికారి రాజీ కుదుర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని, ఓ కానిస్టేబుల్ ద్వారా ఇరువర్గాలకు రాయబారం పంపారని తెలుస్తున్నది. ఓ కాంగ్రెస్ నాయకుడికి ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు కూడా ప్రచారమవుతున్నది.
అభివృద్ధి పేరిట ..
కొంత మంది అభివృద్ధి పనుల పేరిట అటవీశాఖ భూముల్లోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవనాల సముదాయాలకు ఇసుక అవసరముందని చెప్పి దందా సాగిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులు సైతం దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అటవీ సంపదను దోచుకుంటే ఊరుకోం
అటవీ సంపదను దోచుకుంటే కఠినంగా చర్యలు తీసుకుంటాం. గతంలో దాంపూర్‌లో ఇసుక అక్రమార్కులపై కేసులు నమోదు చేశాం. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. నోటీస్‌లు కూడా జారీ చేశాం. అక్రమార్కులు నోటీసులు తీసుకోలేదు. ఇసుక అక్రమ రవాణా చేసిన ట్రాక్టర్ ఇంకా బయటే ఉంది. పోలీసులు ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకోకపోతే కోర్టుకెళ్తాం.
– మంచిర్యాల ఎఫ్ఆర్వో రత్నాకర్‌రావు