కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. గతంలో అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేసిన అధికారులు.. కొంతకాలంగా పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు వాగుల నుంచి యథేచ్ఛగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రాజకీయ అండదండలున్న కొంతమంది దీనినే ప్రధాన వృత్తిగా ఎంచుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది.
రెబ్బెన మండలం గంగాపూర్ వాగు, కాగజ్‌నగర్ మండలం రాస్పల్లి, పెద్ద వాగుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక రెబ్బెన మండలం లక్ష్మీపూర్, గంగాపూర్ వాగుల నుంచి అయితే ఏకంగా జేసీబీల ద్వారా ట్రాక్టర్లలో లోడ్ చేసి ఆపై రహస్య ప్రాంతాల్లో డంపు చేస్తున్నారు. అక్కడి నుంచి పొరుగు జిల్లాలలతో పాటు హైదరాబాద్‌లాంటి పట్టణాలకు తరలిస్తున్నారు. ఒకలారీ లోడ్‌కు రూ. లక్ష వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక స్థానిక నిర్మాణాలకు ట్రాక్టర్ల ద్వారా నేరుగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ. 18 వందల నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నారు.
కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు పెద్దగా దృష్టిసారించడం లేదని తెలుస్తున్నది. జిల్లాలో అనుమతి కలిగిన ఇసుక రీచ్‌లు ఎక్కడా లేవు. కానీ భవన నిర్మాణాలకు కావాల్సినంత ఇసుక మాత్రం లభిస్తోంది. స్థానిక వాగుల్లో నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు లేకున్నా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఇసుక దందాను అడ్డుకోవాల్సిన టాస్క్‌ఫోర్స్ అధికారులు, గనుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.