సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని, ప్రపంచంతో పోటీ పడగలిగే సత్తా ఉంటే మిమ్మల్ని ఆపేవాళ్లు లేరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పుస్తకాల చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే అద్భుత ఫలితాలు వస్తాయని, నేడు కంప్యూటర్లే మానవ మేధస్సును అధ్యయనం చేస్తున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు మొక్కుబడిగా డిగ్రీలు పూర్తి చేయకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని, గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.
చిన్నాచితకా ఉద్యోగాలు కాకుండా.. కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఐకేరెడ్డితో కలిసి అమాత్యుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 36 మందికి గోల్డ్‌మెడల్స్, 576 మందికి పట్టాలు అందజేశారు. అంతముందు ట్రిపుల్ ఐటీ కాన్ఫరెన్స్హాల్లో ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్తోపాటు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రతినిధులతో డైరెక్టర్ సతీశ్‌కుమార్ ఒప్పందం (ఎంవోయూ) చేసుకోగా, త్వరలోనే మినీ టీహబ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.
నిర్మల్(నమస్తే తెలంగాణ)/బాసర, డిసెంబర్ 10 : ‘మూస పద్ధతి వీడాలి. మేధస్సుకు పదును పెట్టాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, అందుకు తగ్గట్టుగా కష్టపడాలి. కంపెనీలు స్థాపించి.. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఉద్ఘాటించారు. శనివారం ఉదయమే హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఐకేరెడ్డి బాసరలోని ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు.
ట్రిపుల్ ఐటీలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్(వీసీ) వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్తోపాటు విద్యార్థులతో సమావేశమయ్యారు. రెండు నెలల క్రితం ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌ను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మెస్‌ల విషయంలో వీసీపై కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ టెండర్లను పిలిచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. మంత్రులు 36 మందికి గోల్డ్ మెడల్స్, 576 మందికి పట్టాలు అందజేశారు. ఇంకా ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్స్, షూస్ కూడా అందజేశారు. కేటీఆర్ సమక్షంలో టీ హబ్ ప్రతినిధులతో డైరెక్టర్ సతీశ్‌కుమార్ ఒప్పందం(ఎంవోయూ) చేసుకున్నారు.
గత సెప్టెంబర్‌లో బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి కేటీఆర్ రాగా.. ఇక్కడి విద్యార్థులు పలు సమస్యలు ఏకరువు పెట్టారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. రెండు, మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలిసి ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. అలాగే యూనిఫామ్స్, షూస్ కూడా ఇచ్చారు.
అలాగే అదనపు డిజిటల్ తరగతి గదులు, ప్రత్యేకంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఐటీసీసీ ల్యాబ్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సెంటర్)తోపాటు సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కోసం మంత్రి శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల కోరిక మేరకు ఇప్పటికే ప్రత్యేకంగా క్రీడల శిక్షణ కోసం ముగ్గురు పీడీలను నియమించారు. మెస్‌లలో నాణ్యమైన భోజనం తయారు చేయించేందుకు అవసరమైన సిబ్బందిని పెంచడంతోపాటు, పర్యవేక్షణ కోసం అదనంగా వార్డెన్లను నియమించారు.
వసతి గృహాల్లో కూడా వార్డెన్ల సంఖ్య పెంచారు. అలాగే విద్యార్థినుల వసతి గృహాలపై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి.. వేడి నీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మంత్రి ఆదేశం మేరకు ఆడిటోరియంలో అదనంగా కొత్త కుర్చీలు ఏర్పాటు చేశారు. అలాగే పరిపాలన, అకాడమిక్ పరంగా తరచూ తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ట్రిపుల్ ఐటీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న హెచ్వోడీలు, డీన్లను మార్చేశారు. 24 గంటలపాటు లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు. ఎకో పార్క్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. విద్యార్థినుల భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా మహిళా ఎస్సైని నియమించారు.
అనంతరం బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐదో స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని అందుకు అనుగుణంగా కష్టపడాలి. అలాంటి ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది. టీ-హబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నదని, ప్రతిభ గల విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దక్కే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. భవిష్యత్తులో అపారమైన అవకాశాలు అందించే డిజిటలైజేషన్, డీ కార్బనైజేషన్, డీ సెంట్రలైజేషన్లపై దృష్టి పెట్టాలి. పుస్తకాల చదువుకు, ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వర్సిటీలు డిజైనింగ్ కోర్సులకు రూపకల్పన చేసి కొత్త పంథాలో విద్యావకాశాలు మెరుగు పర్చాలి. ఉన్నత విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలను మెరుగ్గా తీర్చి దిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నాం. అలాగే పీ1, పీ2లో 1,500 మంది విద్యార్థులకు డెస్క్‌టాప్‌లు ఇస్తున్నాం. మెస్ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందజేస్తాం. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును మిషన్ భగీరథ ద్వారా సుందరీకరించాలని ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు.
మా అమ్మానాన్నలు రమేశ్-నీరజ. మేము ఇద్దరం కూతుళ్లం. నాకు ట్రిపుల్ ఐటీలో 2016 సంవత్సరంలో ఈఈఈలో సీటు వచ్చింది. యూనివర్సిటీ, బ్రాంచ్ టాపర్స్‌గా నిలవడంతో రెండు గోల్డ్‌మెడల్స్ వచ్చాయి. నా చెల్లెలు వైష్ణవి కూడా ఇదే కాలేజీ(2018 సంవత్సరంలో సీటు వచ్చింది)లో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నది. మేమిద్దరం ఒకే చోట చదువుకోవడం ఆనందంగా ఉంది. నాకు మూడు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ.. ఉన్నత చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నా. ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతులు బాగున్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఉన్నతస్థాయికి ఎదగాలి.
– మహాలక్ష్మి, బీ16 బ్యాచ్ యూనివర్సిటీ టాపర్(గోల్డ్‌మెడలిస్ట్), నల్గొండ జిల్లా.
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం సంతోషంగా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఐటీపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లనే సమస్యలన్నీ పరిష్కరించు కోగలిగాం. కోట్లాది రూపాయల నిధులతో యూనివర్సిటీని అద్భుతంగా తీర్చి దిద్దిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కుతుంది. తన పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి చెరువు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్‌కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
– ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి తమ జీవితంలో ఇదో ముఖ్యమైన రోజు. పట్టాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలి. బాసర ట్రిపుల్ ఐటీ అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టం. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే తెలంగాణ బిడ్డలకు చక్కటి వసతులతో పాటు ఉన్నత విద్య అందాలని సీఎం కేసీఆర్ అడిగినన్ని నిధులు మంజూరు చేస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలో విద్యార్థినులు అధికంగా ఉన్నందున, వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పది పడకల దవాఖానను మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 10 : సెప్టెంబర్ 26వ తేదీన బాసర ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నూతన మెస్‌ను ప్రారంభించి విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులు కింద కూర్చోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికి విద్యార్థులు కింద కూర్చోకుండా ఏర్పాట్లు చేయాలని నిధులకు వెనుకాడకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. సరిగ్గా రెండు నెలల అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసేందుకు రావడం సమావేశ మందిరంలో విద్యార్థులు సీట్లలో కూర్చోవడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు.