భీమారం, జూలై 28 : “ఇందిరమ్మ కమిటీ సభ్యులు లిస్టులో మా పేర్లను పెట్టిన్రు. ఎంపీడీవో మధుసూదన్, ఇది వరకు ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి సృజన లంచం తీసుకొని మా పేర్లను తొలగించి.. వేరే వాళ్ల పేర్లు నమోదు చేసిన్రు. ఇందిరమ్మ ఇండ్లు రాకపోతే గడ్డి మందు తాగి చనిపోతం.” అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు నక్క రమేశ్, బీఆర్ఎస్ కార్యకర్త సుందిల్ల వెంకటేశ్ ఆందోళనకు దిగారు.
గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి శ్వేత ముందు మందు డబ్బాతో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు నక్క రమేశ్ పురుగుల మందుతో డబ్బాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించానని, అలాంటిది నా పేరును తొలిగించి వేరే వారి పేర్లను నమోదు చేశారని ఆరోపించాడు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మా పేర్లను ఫైనల్ చేసిందని.. కానీ అధికారులు మా పేర్లను తీసివేశారని మండిపడ్డారు.
మాకు న్యాయం జరిగే వరకూ ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోయవద్దని, అలా పోస్తే గడ్డి మందు తాగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో చనిపోతామని ముగ్గు పోసేందుకు అధికారులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శి శ్వేత ఎంపీడీవో మధుసూదన్ దృష్టికి ఫోన్లో తీసుకుపోగా, ఆ విషయంలో తనకెలాంటి సంబంధం లేదని, మంత్రి పీఏకు చెప్పాలని తెలిపారు. ఆపై మంత్రి పీఏ ఫోన్ నంబర్‌ను పంచాయతీ కార్యదర్శికి ఇచ్చారు. మంత్రి పీఏ ఇక్కడికి వచ్చి ఓట్లు వేయించాడా అంటూ మండిపడ్డారు. సుందిల్ల వెంకటేశ్ మాట్లాడుతూ.. తాను పేద కుటుంబానికి చెందిన వాడినని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకే నా పేరును తొలిగించారని, మంత్రి వివేక్‌కు ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు తెలియవన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు నేను అర్హుడిని కాదా అని ప్రశ్నించారు.