నార్నూర్ : నీతి అయోగ్ కార్యక్రమంలో భాగంగా నార్నూర్ మండలాన్ని (Narnoor Mandal ) ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah ) అన్నారు. గురువారం నార్నూర్, గాదిగూడ మండలంలో ఆయన పర్యటించారు. నడ్డంగూడలో కళాత్మక వెదురు వస్తువుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.
వెదురుతో తయారుచేసిన వస్తువులను పరిశీలిస్తూ, వివరాలు తెలుసుకున్నారు. వెదురు వస్తువులతో ఆర్థికంగా ఎదిగాలన్నారు. జామడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇప్ప పువ్వు పండుగ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రక్తహీనత నిర్మూలనకు మొహా లడ్డూ ఎంతో ఉపయోగపడుతుందని, ఖైర్ దాట్వలో మోహ లడ్డు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
గాదిగూడ మండలం సావిరి పంచాయతీని సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తాగునీటి సమస్యపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎల్పీవో ప్రభాకర్, తహసీల్దార్ జాడి రాజా లింగం, ఎంపీడీవోలు శ్రీనివాస్, పుల్లారావు, పీఆర్డీఈ లింగన్న, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.