ఆదిలాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 104 మంది వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. దరఖాస్తుదారులతో మాట్లాడిన కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పలు సమస్యల కారణంగా ఫిర్యాధులు భారీగా వస్తుండడంతో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు తమకు మంజూరు కాలేదని, అనర్హులకు మంజూరు చేశారంటూ పలువురు కౌంటర్లో దరఖాస్తులు సమర్పించారు.
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు ఇవ్వాలని మాజీ కౌన్సిలర్ అలాల అజయ్ ఆధ్వర్యంలో పట్టణంలోని 33 వార్డుకు చెందిన పేదలు వినతిపత్రం అందజేశారు. వార్డులో 12 మందికి ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారుల వయస్సు 60 సంవత్సరాలు దాటాయని వారికి ఇండ్లు రద్దు చేశారని, వారి కుటుంబ సభ్యులకు మంజూరైన ఇండ్లను కేటాయించాలన్నారు. 20 ఏండ్ల కిందట ఇండ్లు వచ్చిన వారి కుటుంబ సభ్యులకు ఇండ్లు మంజూరు చేయడం లేదని, మున్సిపాలిటీ అధికారులు అనుభవం లేని వారితో జియో ట్యాగింగ్ చేయడం వల్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సరిగా జరగలేదని తెలిపారు.
రెయిన్ కోట్లు, బియ్యం ఇవ్వాలి
తమకు బియ్యం, ఇతర ఆహార వస్తువులతోపాటు రెయిన్ కోట్లు, చేతిగ్లౌజ్లు, బూట్లు, ఇతర రక్షణ పరికరాలకు అందజేయాలని ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్మికులు కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. నిబంధనల మేరకు కార్మికులకు ఇవ్వాల్సిన వాటిని అందజేయాలన్నారు. వర్షాకాలంలో రెయిన్ కోట్లు లేని కారణంగా తడుస్తూ పనిచేయాల్సి వస్తుందన్నారు.
మధ్యాహ్న భోజనం బిల్లులు ఇవ్వాలి..
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్న తమకు ఏడాదిగా వేతనంతోపాటు ఇతర బిల్లులు మంజూరు కావడం లేదని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వాహకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఏడాదిగా కోడిగుడ్ల బిల్లులు రావడం లేదని, మెస్ బిల్లులు ఆరు నెలలు, రాగిజావ బిల్లులు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయన్నారు. ఐదు నెలల నుంచి తమకు రావాల్సిన వేతనాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో తాము అప్పులు తీసుకొచ్చి భోజనం వండి పెడున్నామన్నారు.