మంచిర్యాల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోగల గర్మిళ్ల శివారులోని సర్వే నంబర్ 290లో అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్వే నంబర్లో దాదాపు 19.28 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9 ఎకరాల్లో 2004 ప్లాటింగ్ చేసిన కొందరు రియల్టర్లు వాటిని విక్రయించారు. గడిచిన 20 ఏండ్లలో ఆ ప్లాట్లు ఎన్నో చేతులు మారుతూ వచ్చాయి. రెండు నెలల క్రితం అధికార పార్టీకి చెందిన నాయకుడు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్.. ఇక్కడ ఎకరం 25 గుంటలు కొనుగోలు చేశానంటూ 21 ప్లాట్ల చుట్టూ ఫెన్సింగ్ వేశాడు.
ఆ 21 ప్లాట్లతో పాటు మరో 6 ప్లాట్లలో కొంతభాగం ఈ ఫెన్సింగ్‌లో పోయిందని ప్లాట్స్ కొనుగోలు చేసిన బాధితులు చెబుతున్నారు. 20 ఏండ్లుగా ఏనాడూరాని వ్యక్తులు ఉన్న ఫలంగా వచ్చి ఈ భూమి మాదంటూ దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేశారని వారు వాపోతున్నారు. రెండు నెలలుగా పోలీసులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా.. ఎన్ని ఫిర్యాదులు చేసినా న్యాయం జరగడం లేదని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఫెన్సింగ్ వేసిన దగ్గర ధర్నాకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఆ సర్వే నంబర్లో ఎకరం 25 గుంటలు ఎక్కడ..?
2004లో మంచిర్యాల జిల్లాకు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ ప్యాపారులు సర్వే నంబర్ 290లోని 9 ఎకరాల్లో ప్లాటింగ్ చేశారు. మొత్తం 137 ప్లాట్లు చేసి రెండు సంవత్సరాల్లో వాటిని విక్రయించారు. ఇదే సర్వే నంబర్లో ఓ డాక్టర్ పేరుపై ఎకరం 25 గుంటలకు 1980 నుంచి పట్టా ఉంది. ఆ డాక్టర్ 2025 జనవరిలో ఆ భూమి తనకు అమ్మేశారంటూ రామగుండం మాజీ కార్పొరేటర్ చెబుతున్నారు. ఆ ఎకరం 25 గుంటల భూమిని వ్యవసాయ భూమిగా పట్టా చేయించారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. వ్యవసాయ పట్టాతో దౌర్జన్యంగా వచ్చి ప్లాటింగ్ చేసిన భూమిలో సదరు కార్పొరేటర్ ఫెన్సింగ్ వేశారంటూ బాధితులు చెబుతున్నారు. 20 ఏండ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్లాట్లు వ్యవసాయ భూములు ఎలా అవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ భూములను వ్యవసాయ భూములుగా ఎలా పట్టా చేశారో రెవెన్యూ అధికారులు చెప్పాలంటున్నారు.
అసలు ఆ ఎకరం 25 గుంటలు సర్వే నంబర్ 290లో ఎక్కడుతుందో సర్వే చేయించాలని కోరుతున్నారు. ఇవేమీ లేకుండా సర్వే నంబర్ 290లో ఎక్కడ ఫెన్సింగ్ వేస్తే ఆ భూమి వారిదే అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లింక్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు..
ఈ విషయమై పోలీసులను సంప్రదించినట్లు బాధితు చెబుతున్నారు. సదరు మాజీ కార్పొరేటర్ తమ ప్లాట్లలో దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇలా జనవరి నుంచి ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఒక్కసారి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదట. ప్లాట్లను ఆక్రమించి ఇబ్బందులు పెడుతున్న మాజీ కార్పొరేటర్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్తే, తన మీద కాదు మీకు ప్లాట్లు అమ్మిన యాజమానుల మీద ఫిర్యాదు ఇవ్వడంటూ ఓ పోలీసు అధికారి ఫోర్స్ చేశారట.
దీంతో చేసేది ఏమీలేక బాధితులు రామగుండం వెళ్లి సీపీని కలిశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు తిరిగి ఫోన్ చేసి ఫిర్యాదు ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారట. కానీ ఫిర్యాదు మీకు విక్రయించిన యాజమానుల మీద ఇవ్వాలంటూ చెప్పడంతో ఏం చేయాలో బాధితులకు పాలుపోలేదు. ఇక రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే అంతంత మాత్రంగానే స్పందన వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన ఓ వ్యక్తి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వల్లే పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం లేదని బాధితులు చెబుతున్నారు.
అధికార పార్టీ లీడర్లు కావడంతో బాధితులు వెళ్లి ఎమ్మెల్యేను కలిసినట్లు చెబుతున్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో ఏం చేయాలో తెలియక ధర్నాకు దిగామని, మా భూములు మాకు కావాలని.. లేకపోతే ఇక్కడే సచ్చిపోతామంటూ బాధితులు చెప్పుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితులందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఏసీపీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే చర్చ జిల్లాలో నడుస్తున్నది. ఇప్పటికైనా అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు బాధితులకు న్యాయం చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉన్నది.
భయభ్రాంతుకలు గురి చేస్తున్నరు
2012లో నా మిత్రుడు అమ్మితే ఇక్కడ ప్లాట్ కొన్నా. డాక్యుమెంట్లు అన్నీ చెక్ చేసి కొనుగోలు చేశాను. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ ప్లాట్ మా ఆధీనంలోనే ఉంది. 2025 జనవరిలో రామగుండం మాజీ కార్పొరేటర్ ముదాం శ్రీను వచ్చి ఇదంతా నా జాగ అని చెప్పిండు. అక్రమంగా మా ప్లాట్లను కబ్జా చేసి చుట్టూ సిమెంట్ పలకల ఫెన్సింగ్ వేసిండు. మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నరు. పోలీసులు న్యాయం చేయడం లేదు. డీసీపీ, ఏసీపీ, సీపీని కలిశాం. వాళ్లు సరిగా స్పందించకపోవడంతో ధర్నా చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. లేకపోతే ఇక్కడే ప్రాణాలైనా తీసుకోవాలి.
– బద్రి శ్రీనివాస్, బాధితుడు
ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
2012లో మా నాన్న కటకం మల్లయ్య నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు. అప్పుడు ఈసీ, లింక్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులన్నీ సరిచూసుకున్నాం. అంతా ఓకే అనుకున్నాకే ప్లాట్ కొన్నాం. ముదాం శ్రీను జనవరి 31న వచ్చి అక్రమంగా పలకలు వేశారు. సీఐ సార్‌కు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు తీసుకోవడం తప్ప ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎనిమిది సార్లు ఫిర్యాదు చేశాం. ముదాం శ్రీను మీద ఫిర్యాదు చేద్దామంటే అలా కాదు పట్టాదారుల మీద చేయండని మమ్ములను ఒత్తిడి చేస్తున్నారు. పట్టాదారులు 2004లో వెంచర్ చేసి విక్రయించారు. మధ్యలో చేతులు మారాయి. ఇప్పుడు వచ్చి దౌర్జన్యం చేస్తున్న వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయకుండా, పట్టదారుల మీద ఫిర్యాదు ఇవ్వండి అనడం ఎంత వరకు కరెక్టు. మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. దయచేసి న్యాయం చేయాలి.
– సాయికుమార్, బాధితుడు
నాకు ఇద్దరు ఆడపిల్లలు.. ఈ ప్లాటే ఆధారం
ఉన్నది ఈ ఒక్కటే ప్లాట్. ఇదే నాకు ఆధారం. నా రెక్కల కష్టం సారూ. నాకు భర్త లేడు. కొడుకు లేడు. ఇద్ద రు ఆడపిల్లలు. పదేండ్ల కింద కొన్న. అప్పటి నుంచి ఎలాంటి స మస్య రాలేదు. ఇప్పుడు వచ్చి నా ది భూమి అంటున్నరు. నేను ఎక్క డికి పోవాలి సారూ. నాకు న్యా యం కావాలి. నా ప్లాట్ నాకు కావాలి.
– శోభారాణి, బాధితురాలు