చెన్నూర్, సెప్టెంబర్ 15 : కొన్నేళ్లక్రితం చెన్నూర్ పట్టణంలోని సర్వే నంబర్ 840లోని ప్రభుత్వ భూమి(బిల్లాదాఖల్)ని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టగా, సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేశారు. అందులో షెడ్లు (ఇండ్లు) సైతం నిర్మించుకున్నారు. చెన్నూర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పు డు షెడ్లు నిర్మించుకున్నవారికి అనుమతులు, ఇంటి నంబర్లను సైతం ఇచ్చారు. తర్వాత చెన్నూర్ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కూడా షెడ్లు కట్టుకున్న వారికి కూడా మున్సిపాలిటీ అధికారులు అనుమతులతో పాటు ఇంటి నంబర్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వ భూమిలో షెడ్లు (ఇండ్లను) నిర్మించుకున్నారని, గతంలోని దస్తావేజులు మూడు రోజుల్లో సమర్పించాలని మున్సిపాలిటీ వారు నోటీసులు జారీ చేశారు. ఇట్టి నోటీసులను సర్వే నంబర్ 840లో నిర్మించుకున్న ప్రతి ఇంటికీ అంటించగా, యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకుంటే అనుమతులతో పాటు ఇంటి నంబర్లు కూడా ఇచ్చారని, ఈ వివరాలు మున్సిపాలిటీ ఆన్లైన్లో కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.
ఇది ప్రభుత్వ స్థలమైతే అప్పట్లో అధికారులు తమకు అన్ని రకాల అనుమతులు, ఇంటి నంబర్లు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో అన్ని రకాల దస్తావేజులు సమర్పించిన తర్వాతే తమకు ఇంటి నంబర్లు ఇచ్చారని, ప్రస్తుతం మరోసారి దస్తావేజులు సమర్పించమని నోటీసులు ఎందుకు ఇచ్చారో అంతుపట్టడం లేదని వారు పేర్కొంటున్నారు. అప్పట్లో తాము సమర్పించిన దస్తావేజులు ఏమయ్యాయని, ఇలా ఎన్నిసార్లు అడుగుతారని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మారినప్పుడల్లా దస్తావేజలు అడుగుతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లోనే ఈ అక్రమ నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు, అప్పటి గ్రామ పంచాయతీ సిబ్బంది, తర్వాత మున్సిపాలిటీ అధికారులు అడ్డుకోవాల్సి ఉండేది. కానీ, వారు మిన్నకుండి పోవడంతో ఈ ప్రభుత్వ భూములను బ్రోకర్ల ద్వారా కొనుగోలు చేసి.. వారి ఆర్థిక స్థోమతను బట్టి భవనాలు, షెడ్లు నిర్మించుకున్నారు. అప్పట్లోనే అధికారులు అడ్డుకుంటే తాము ఇంటి స్థలాలను కొనుక్కునే వారమే కాదని వారు చెబుతున్నారు.
అప్పట్లో అధికారులు వ్యవహరించిన తీరుతోనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్లుగా చెన్నూర్ పట్టణ శివారులోని వందలాది ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ భూములని, ఇందులో ఎలాం టి నిర్మాణాలు చేపట్టరాదని ఇటు రెవెన్యూ అధికారులు, అప్పటి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆపై మున్సిపాలిటీ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరించారు. అంతేగాకుండా అప్పటి అధికారులు అందిన కాడికి దండుకొని అక్రమ నిర్మాణాలకు అనుమతులతో పాటు ఇంటి నంబర్లు కేటాయించి, ఆన్లైన్ రికార్డుల్లో పొందుపర్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్మాణాల కోసం అవసరమైన భూమి లేకపోవడంతో అధికారులు ఆ భూమిని తీసుకునేందుకు వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు అర్థమవుతున్నది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇస్తూనే, అప్పట్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు, ఇంటి నంబర్లు ఎలా కేటాయించారు అనే విషయాలపై విచారణ జరిపి, అందుకు బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఇండ్లకు నోటీసులు జారీ చేసే విషయమై వివరణ కోరేందుకు మున్సిపాలిటీ కమిషనర్ గంగాధర్‌ను ప్రయత్నించగా అందుబాటులో లేరు.