నార్నూర్, మార్చి 6 : అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం బొజ్జుగూడలో గురువారం రాత్రి అకస్మాత్తుగా ఇల్లు కాలి దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. బాధితుడు ఉర్వేత సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయని దీంతో ఇల్లు పూర్తిగా ఖాళీ బూడిదైందని తెలిపారు. సామగ్రిలు, నిత్యావసర సరుకులు, కందులు, గోధుమలు, జొన్నలు, పప్పులు, డబ్బులు కాలినట్లు పేర్కొన్నారు. సుమారు ఐదు లక్షల పైన ఆస్తి నష్టం జరిగిందన్నారు.
మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన అదుపులోకి రాలేదన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ జాదవ్ సేవంత బాయి, మాజీ సర్పంచ్ జాదవ్ సంతోష్ సంఘాల స్థలానికి చేరుకొని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.