వేమనపల్లి, మార్చి 14: హోలీ వేడుకల్లో విషాదం నెలకొన్నది. స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లిన గల్లంతై మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి కంపెల బాపు-లక్ష్మీ దంపతులకు ఏకైక కుమారుడు రాజ్‌కుమార్ (19) ఉన్నాడు.
రాజ్‌కుమార్ చిన్నతనంలోనే బాపు మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ రాజ్‌కుమార్ (చెన్నూరులోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్) ను చదివిస్తున్నది. శుక్రవారం రాజ్‌కుమార్ తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం ఉదయం 11గంటలకు వేమనపల్లి సమీపంలో ఉన్న ప్రాణహిత నదికి కంపెల నవీన్, గుమ్మెల సాయికృష్ణ, బక్కి రాకేశ్, చింతల అభిరామ్‌తో కలిసి స్నానం చేయడానికి వెళ్లాడు. వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద స్నానం చేశారు.
ముగ్గురు స్నేహితులు బహిర్భూమికి వెళ్లగా, రాజ్‌కుమార్ మరో స్నేహితుడితో కలిసి స్నానం చేసేందుకు నీటిలోకి తీగాడు. ప్రమాదవశాత్తూ కాలు జారడంతో నీటిలో మునిగిపోయాడు. తోటి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. నీల్వాయి ఎస్ఐ శ్యామ్‌పటేల్ ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాజ్‌కుమార్ మృతదేహం లభించింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు పండుగ పూట మృతి చెందడంతో ఆ తల్లి లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించింది.