‘లేవండి..! మేల్కొండి..! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’.. ‘లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తే.. నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది’ అని అంటారు స్వామి వివేకానంద. ఇప్పుడు ఉద్యోగ అభ్యర్థులు అదే పనిచేయాలంటు న్నారు నిపుణులు. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో కొలువుల కుంభమేళాకు ప్రభుత్వం తెరలేపింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నది. కొలువు కొట్టే వాళ్లకు బహుషా ఇంతకు మించిన మరో అవకాశం రాదంటున్నారు విద్యారంగ నిపుణులు. అందుకే.. ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోవడమే కాదు.. ఒక ప్రణాళికాద్ధంగా చదివితే ఉద్యోగం రావడం ఖాయం. అందులోనూ ఇతర జిల్లాలతో పోల్చితే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగ అభ్యర్థులు జాబ్ కొట్టేందుకు అధిక అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం కొత్త జోనల్ వ్యవస్థ బాగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. – కరీంనగర్/ఆదిలాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్/ఆదిలాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ వేదికగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 80,039 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3,919 ఉద్యోగాలు లభించనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1,193, నిర్మల్‌లో 876, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 825, మంచిర్యాలలో 1,025 పోస్టులు భర్తీ కానున్నాయి. బాసర జోన్ పరిధిలోకి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు రానుండగా.. 2,328.. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి రానుండగా.. 1,630, నాలుగు జిల్లాల పరిధిలో ఉండే మల్టీజోనల్-1లో 6,800 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఇంత భారీ సంఖ్యలో ఏనాడు ఖాళీలు చూపలేదు. ఈ నేపథ్యంలో కొంత కష్టపడితే కొలువు కొట్టాలన్న కల నెరవేరేందుకు ఆస్కారం ఉందన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే విజయం సాధించడం ఖాయమని అనుభవజ్ఞలు చెపుతున్నారు. ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోవాలని, లేకపోతే.. మంచి అవకాశాన్ని కోల్పోయినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పాత వ్యవస్థను ప్రక్షాళన చేసి.. కొత్త జోనల్ వ్యవస్థకు అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లావాసులకు అధిక ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా రెండు జోన్ల పరిధిలోకి వస్తుంది. ఆయా జోన్లలో మన ఉమ్మడి జిల్లాతో పోల్చితే.. విద్యారంగంలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. జోనల్, మల్టీజోనల్ పోస్టుల ను కొట్టేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయంటున్నారు.
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి వెళ్లాయి. ఈ జోన్ పరిధిలో ఇంకా భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాలు కూడా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా మిన హా మిగిలిన జిల్లాలు విద్యారంగంలో వెనుకబడి ఉన్నా యి. అంటే ఈ జోన్ పరిధిలో ఉండే పోస్టులకు పోటీ పడే సమయంలో మంచిర్యాల ఉద్యోగ అభ్యర్థులు ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లావాసులు జిల్లా, జోనల్ పోస్టుల పరంగా బదిలీల విషయంలో చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. కానీ.. ప్రస్తుతం జోన్ పరిధి తగ్గడంతోపాటు దూరం కూడా తగ్గనుంది. అలాగే పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు రైల్వే సౌకర్యం ఉంది. ఉద్యోగులు వెళ్లి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ జోన్ పరిధిలోని ఇతర జిల్లాలతో పోల్చి చూసినప్పుడు విద్యా, ఉద్యోగాల పరంగానే కాదు ఏ రంగంలో చూసినా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు ప్రథమ స్థానంలో ఉంటాయి.
ఇక ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు బాసర జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్లో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్ మినహా మిగిలిన మూడు జిల్లాలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంటా యి. నిర్మల్ విద్యారంగం ముందు నుంచి పటిష్టంగా ఉంది. కాబట్టి..
కుంభమేళా తరహాలో కొలువుల జాతరకు ప్రభుత్వం తెరలేపడం దేశ చరిత్రలోనే మొదటిసారి. దీన్ని ఉద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వస్తాయి. ఇదే సమయంలో నిరుద్యోగులు అపోహలు, పుకార్లు, అసత్యాలు నమ్మవద్దు. తద్వారా సమయం వృథా అవుతుందే తప్పా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రణాళికాబద్ధంగా చదువుపై దృష్టిపెట్టాలి. అప్పుడు వారు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. నిజానికి ప్రతి ఒక్కరిలో ఒక ఐక్యూ ఉంటుంది. దీనిని ఒక అర్థవంతంగా, సమయానుకూలంగా వాడుకోవడంలోనే విజయం ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు గ్రూపులకు సంబంధించి దాదాపు కొంత అటుఇటుగా కామన్ సిలబస్ ఉంటుంది. పెద్ద గోల్ పెట్టుకొని ప్రిపేర్ అయితే.. ఏదో ఒక ఉద్యోగం కచ్చితంగా వస్తుంది. సాధించాలన్న పట్టుదలతో ముందుకెళ్తే విజయం వరిస్తుంది. పుకార్లు నమ్మితే చివరకు ఎటు కాకుండా పోతాం. ఎవరో నిర్దేశిస్తే కాదు.. ఎవరికి వారే ఎంత కష్టపడుతారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
– మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఇది నిరుద్యోగులకు వరమే. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. హోం, వైద్య, విద్యాశాఖలకు చెందినవి ఎక్కువగా ఉన్నాయి. గురుకులాలకు సంబంధించి 11 వేల ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్-1 పోస్టులు 503 ఉన్నాయి. గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివితే ఉద్యోగం తప్పక వస్తుంది.
– ప్రవీణ్‌కుమార్, బీసీ స్టడీ సర్కిల్, డైరెక్టర్, ఆదిలాబాద్
ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఐదారు రకాల ఉద్యోగాలకు ఒకే రకమైన సిలబస్ ఇచ్చే అవకాశాలున్నాయి. వయోపరి మితి కూడా పదేళ్లకు పెంచారు. ఇది నిరుద్యోగు లకు మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. పోటీ పరీక్షలకు సంబం ధించిన మెటీరియల్స్‌ను సేకరించుకోవాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం గ్యారంటీ.
– మారుతి శర్మ. అధ్యాపకుడు, రసాయన శాస్త్రం, ఆదిలాబాద్
నిర్మల్ టౌన్, మార్చి 10 : జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ముఖ్యంగా మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పకడ్బందీ స్టడీ మెటీరియల్ సేకరణ, ప్రణాళికాబద్ధమైన సమయసారణి, పటిష్టమైన ఏకాగ్రతతో కూడిన అధ్యయనం. ఇవి కీలకం. అంతేగాక అన్ని ఉద్యోగాలకు సరిపడా కామన్ మెటీరియల్స్‌ను సమీకరించుకోవడం ముఖ్యమైన అంశం. ప్రస్తుతం అనేక విద్యాసంబంధిత వెబ్సైట్లు ఆన్లైన్ మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటిని కూడా అదనపు రెఫరెన్స్‌గా ఉపయోగించుకొని చదవడం వల్ల ఉద్యోగాన్ని అవలీలగా సాధించవచ్చు. చదువుకునేటప్పుడు మానసిక ఒత్తిడి దూరం చేసుకోవాలి. చదివిన ప్రతి అంశాన్ని జ్ఞాపకం ఉండేలా నోట్డైరీ రాసుకుంటే మంచిది. నేను పై అంశాలను పాటించి నాలుగు ఉద్యోగాలు పొందాను. మొదట ఫారెస్టు బీట్ ఆఫీసర్, ఆ తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్, రెండు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాను.
– బీ.ప్రమోద్రాం, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఎడ్యుకేషన్ సైకాలజిస్టు, పరిమండల్
నిర్మల్ టౌన్, మార్చి 10 : ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగం రావాలంటే తప్పనిసరిగా సమయసారిణి రూపొందించు కోవాలి. మూడు నెలల పాటు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. ఉద్యోగానికి అవసరమయ్యే అన్ని సబ్జెక్టుల మెటీరియల్స్‌ను సేకరించుకోవాలి. ప్రతిరోజూ 14 నుంచి 18 గంటల పాటు చదవాలి. ఎక్కువ పుస్తకాలు కొనుగోలు చేసేకంటే అన్ని విషయాలున్న స్టడీ మెటీరియల్స్‌ను ఎంపిక చేసుకుంటే మంచిది. ఆ శాఖకు సంబంధించిన సీనియర్ ఉద్యోగులతో మాట్లాడి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. సరైన సమయానికి ఆహారం, నిద్ర కూడా అవసరమే. నాకు ఇప్పటి వరకు ఐదు ఉద్యోగాలు వచ్చాయి. మొదట ఎస్జీటీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్, సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్, ఏపీఎల్బీసీలో సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికయ్యా. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ చరిత్ర ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నా. అన్ని విషయాల్లో పరిజ్ఞానం పెంపొందించుకోవడం వల్లే అనుకున్నది సాధించాను. – పీజీ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్