భైంసా టౌన్, జూన్ 7 : భైంసా మండలంలోని గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గుంతలు పడి, కంకర తేలి, వంకలుగా ఉండి వాహనదారులు, పాదచారులు నడువ లేని దుస్థితి నెలకున్నది. మండలంలోని పెండ్పల్లి, ఇలేగాం, ఖత్గాం, సిరాల, మహగాం-చింతల్బోరి, సిద్దూర్, వాలేగాం-రంగరివాడ, వాడి గ్రామస్తులు వివిధ పనుల నిమిత్తం భైంసా మండలానికి వస్తుంటారు. విద్యార్థులు చదువుకోవడానికి, కూలీలు పనులకు, దవాఖానలకు వంటి ప్రజలు వివిధ పనుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు.
మూడు కిలో మీటర్ల మేర పెండ్పల్లి రహదారి, రెండు కిలోమీటర్ల మేర ఇలేగాం, రెండు కిలోమీటర్ల మేర ఖత్గాం, రెండు కిలోమీటర్ల మేర సిరాల, రెండు కిలోమీటర్ల మేర మహగాం-చింతల్బోరి, కిలోమీటరు మేర సిద్దూర్, మూడు కిలో మీటర్ల మేర వాలేగాం-రంగరివాడ, రెండు కిలోమీటర్ల మేర వాడి గ్రామాల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీటిలో పెండ్పల్లి, ఖత్గాం గ్రామాలకు రూ.కోటి చొప్పున నిధులు కూడా కేటాయించారు. అయినా పనులు ప్రారంభం కాలేదు. తాజాగా పది రోజుల క్రితం ఖత్గాం గ్రామస్తులు రహదారులను బాగు చేయాలని ధర్నా కూడా చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సర్కారోళ్లు స్పందించి రోడ్డలను బాగు చేయించాలని పల్లెవాసులు కోరుతున్నారు.