కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. రాజకీయ అండదండలున్న కొంత మంది నాయకులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. ఏమాత్రం బెదరని మాఫియా యథేచ్ఛగా స్థానిక వాగుల నుంచి ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నది. రెబ్బెన మండలం గంగాపూర్ వాగు, కాగజ్‌నగర్ మండలంలోని రస్పపల్లి వాగు, పెద్దవాగుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో ఇసుకను తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
ఇక రెబ్బెన మండలం లక్ష్మీపూర్, గంగాపూర్ వాగుల నుంచి అయితే ఏకంగా జేసీబీల ద్వారా ట్రాక్టర్లలో ఇసుక నింపి ఆపై రహస్య ప్రాంతాల్లో డంపు చేస్తున్నారు. ఆపై అక్కడి నుంచి పొరుగు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లాంటి పట్టణాలకు తరలిస్తున్నారు. ఒక లారీ లోడ్‌కు ఇసుకను రూ. లక్ష దాకా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక స్థానిక నిర్మాణాలకు ట్రాక్టర్ల ద్వారా నేరుగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ. 1500 వరకు తీసుకుంటున్నారు.
ఒకే రోజు 11 ట్రాక్టర్లు పట్టివేత
జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దవాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లను అధికారులు బుధవారం పట్టుకొన్నారు. గత పది రోజులుగా అనేక వాహనాలను అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకొని అధికారులు కేసులు పెడుతున్నప్పటికీ దందాకు బ్రేక్ పడడం లేదు. దండుకున్నోడికి దండుకున్నంత అన్న చందంగా వ్యాపారం సాగుతున్నది.