మంచిర్యాల ప్రతినిధి,ఆగస్టు 16/కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు రోజులుగా జోరుగా వర్షాలు పడుతుండగా, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంటలు, కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు, ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా సరాసరిన 25.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జైనూర్‌లో 16.4 మిల్లీ మీటర్లు, సిర్పూర్-యూలో 15.6, లింగాపూర్‌లో 30.8, తిర్యాణిలో 27.8, రెబ్బెనలో 8.0, ఆసిఫాబాద్‌లో 30.8, కెరమెరిలో 16.2, వాంకిడిలో 10.8, కాగజ్‌నగర్‌లో 7.8, సిర్పూర్-టీలో 16.8, కౌటాలలో 65.4, చింతలమానేపల్లిలో 29.2, బెజ్జూర్‌లో 47.2, పెంచికల్పేట్లో 40.4, దహెగాంలో 25.2 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా కౌటాలలో 65.4 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అతితక్కువగా కాగజ్‌నగర్‌లో 7.8 మిల్లీ మీటర్లు పడింది.
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణ కేంద్రాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లా సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. పెద్దవాగు ఉప్పొంగింది. బెజ్జూర్ మండలంలోని సుస్మీర్ వాగు నిండుగా ప్రవహిస్తుండగా, సుస్మీర్, సోమిని, గెర్రెగూడ, ఇప్పలగూడ, మూగవెల్లి, బండలగూడ, నాగపల్లి, పాత సోమిని, పాతగెర్రెగూడ గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తలాయి-భీమారం వద్ద బ్యాక్ వాటర్ రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చింతలమానేపల్లి మండలంలోని దిందా- కేతిని, బాబాసాగర్-నాయకపుగూడ వాగులకు వరద పోటెత్తడంతో ఆయాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. దహెగాం మండలం ఐనం వద్ద లో లెవల్ వంతెన పైకి వరద రావడంతో దహెగాం-కాగజ్‌నగర్ మధ్య వాహనాలను నిలిపివేశారు.
ఐనం ఒర్రెతో పాటు, లగ్గాం బద్దోని ఒర్రె పొంగాయి. పెసర్‌కుంట గ్రామాన్ని సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా సందర్శించారు. చింతలమానేపల్లి మండలం అనుకోడలో పెంకుటిల్లు కూలిపోయింది. ఆసిఫాబాద్‌లోని రాజూర, రెబ్బెనలోని నంబాల, కెరమెరిలోని లక్మాపూర్, అనార్పల్లి, జైనూర్లోని గౌరి-లెండిగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా, 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచనల మేరకు బీఆర్ఎస్ నాయకులు రెబ్బెనలోని ఎన్టీఆర్ కాలనీలో సహాయక చర్యలు చేపట్టారు. రాజూర గ్రామానికి వెళ్లే రహదారిపైన ఉన్న లో లెవెల్ వంతెన ఇరువైపులా కోతకు గురికాగా, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (8500844365) ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దహెగాం మండలం అందెవెల్లి- బట్టుపల్లి గ్రామాల మధ్య రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన తెలిపారు.
మంచిర్యాల పట్టణంలో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టూ టౌన్ ఏరియాలోని సూర్యనగర్ నీట మునిగింది. హమాలీవాడ, తిలక్‌నగర్, బృందావన్ కాలనీ, సీతారామకాలనీ, సున్నంబట్టివాడ, సాయికుంట, గర్మిళ్ల, పాత మంచిర్యాల తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరద చేరింది. రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బైపాస్‌రోడ్డు నుంచి రంగంపేటకు మధ్య కాజ్వే పై నుంచి వరద ప్రవహిస్తున్నది. బైపాస్‌రోడ్డు నుంచి రంగంపేట, పవర్కాలనీ, పాత మంచిర్యాల, అండాళమ్మ కాలనీల వైపునకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
ముల్కల్ల గ్రామ శివారులో జాతీయ రహదారి పై భారీ చెట్టు విరిగిపడగా, ట్రాఫిక్ స్తంభించింది. జేసీబీతో దానిని తొలగించి రాకపోకలను పున:రుద్ధరించారు. గుడిపేట గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టును కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. రానున్న 36 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నం. 08736-250501కు సమాచారమివ్వాలన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. చెన్నూర్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయయ్యాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్, ప్రత్యేక రెస్క్యూటీం ఏర్పాటు చేశారు. పలుచోట్ల ఇండ్లలోకి నీరు చేరడంతో మున్సిపల్ సిబ్బంది మోటర్లు ఏర్పాటు చేసి, ఎత్తిపోశారు.
శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉంటున్న వారిని గుర్తించి, మైనార్టీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. కత్తెరశాల వాగు ఉప్పొంగి ప్రవహించింది. భీమారంలోని ఆరెపల్లి చౌరస్తాతో పాటు బూర్గుపల్లి-నర్సింగాపూర్ మధ్యలో ఉన్న పెద్ద వాగు లో లెవల్ వంతెనపైకి నీరు చేరింది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దండేపల్లి మండలంలోని గూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. మేదరిపేట-నర్సాపూర్ మధ్య ఉన్న లో లెవల్ వంతెన నీటమునిగింది. రాకపోకలు నిలిచిపోయాయి. నర్సాపూర్ గ్రామానికి చెందిన శాతరాజు సతీశ్‌కు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. శ్రీరాంపూర్ ఓసీపీలో 10 వేల టన్నులు, ఇందారం ఓసీపీలో 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. నెన్నెల మండలంలో సుమారు 150 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
కుమ్మరివాగు చెరువు కుడి కాల్వ తెగడంతో వరద పంట పొలాల్లోకి చేరింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు వరదలో చిక్కుకున్నాయి. నెన్నెల సమీపంలోని ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో, దాదాపు వంద ఎకరాల పత్తి నీట మునిగింది. గంగారం, నెన్నెల, ఆవుడం గ్రామాల్లో 5 ఇండ్లు కూలిపోయాయి. 500 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. ఎర్రవాగు ప్రవాహం, దెబ్బతిన్న పంటలను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. వేమనపల్లి మండలంలోని నీల్వాయి-మామడ దారిలో వాగు ఉధృతంగా ప్రవహించగా, తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. బద్దెంపల్లిలోని తొర్రెం చిన్న రాజక్క ఇల్లు, కేతనపల్లిలోని అనుముల బాపు ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది.
నీల్వాయి ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నది. ప్రాణహిత ఉధృతంగా ప్రవహించడంతో పడవలు నడపవద్దని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే కంట్రోల్ రూమ్ 08736-250501ను సంప్రదించాలని తెలిపారు. లక్షెట్టిపేటలోని మస్తాన్‌గూడ, బీట్ బజార్, గోదావరి రోడ్, పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. తొమ్మిదో వార్డులోని దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి నీరు చేరగా, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాసర్‌తో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు.
తాండూర్ మండలంలోని అచ్చలాపూర్‌లో ఓ ఇంట్లోకి చేరింది. కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి, లింగాలలో పంటలు నీట మునిగాయి. కాసిపేట మండలంలోని బుగ్గగూడెంకు చెందిన మార్నేని సంజీవ్, మార్నేని సంతోష్, మార్నేని సాగర్, బద్ది అరుణ్, ఏదుల శశికుమార్ వరిపేట శివారు, కన్నాల పరిధిలోని బుగ్గ చెరువు మత్తడిలో చేపల వేటకు వెళ్లగా, అక్కడే చిక్కుకున్నారు. వారిని తాళ్లసాయంతో స్థానికులు కాపాడారు. మందమర్రిలోని పలు కాలనీల్లోకి వరద చేరింది.
కుమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా, కట్టబలహీనంగా ఉండడంతో అధికారులు 5 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 5.461 టీఎంసీలు ఉండగా, ఇన్‌ప్లో 3029 క్యూసెక్కులు వస్తున్నది. నాలుగు గేట్లు 0.2 మీటర్ల మేర తెరిచి 3029 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి వరద వస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 147.12 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.7303 టీఎంసీల నీరు ఉంది. మొత్తంగా 1,89,559 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, మొత్తం 20 గేట్లు రెండు మీటర్ల మేర ఎత్తి 3 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.
ఆసిఫాబాద్‌టౌన్ : ఉధృతంగా ప్రవహిస్తున్న తుంపల్లి వాగు
కాసిపేట : బుగ్గ చెరువు మత్తడిలో చిక్కుకున్న యువకులు
కోటపల్లి : ఎదుల్లబంధం సమీపంలో తుంతుంగ చెరువు మత్తడి ప్రవాహం
దహెగాం : మాజీ ఎంపీపీ వాణీప్రసాద్ ఇంట్లోకి చేరిన వర్షపు నీరు
కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు వెళ్తున్న వరద
హాజీపూర్ : ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువకు పరవళ్లు తొక్కుతున్న వరద
మంచిర్యాల వద్ద రంగంపేట కాజ్వే పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న రాళ్లవాగు
ఆసిఫాబాద్ టౌన్ : తుంపల్లి వాగును పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
భీమిని : నీట మునిగిన పత్తి పంటను చూపుతున్న రైతు ప్రకాశ్
రెబ్బెన : ఉప్పొంగి ప్రవహిస్తున్న నంబాల వాగు
శ్రీరాంపూర్ : ఓసీపీలో ఉత్పత్తిలేక నిలిచిపోయిన డంపర్లు