హాజీపూర్/జన్నారం/దండేపల్లి మార్చి 22 : హాజీపూర్ మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. మక్క, వరి పంటలు నేలకొరిగాయి. మరో 20 రోజుల్లో మార్కెట్‌కు తరలించాల్సిన మామిడి కాయలు నేల రాలడంతో ఈ వర్షం తమ నోట్లో మట్టి కొట్టిందని రైతులు వాపోయారు.
పొట్ట, పీచు, పిందె దశలలో ఉన్న వరి, మక్క, మామిడి పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి సాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు. మండలంలో దాదాపు 70 ఎకరాల వరి పంట, 70 ఎకరాల మక్క పంటలు దెబ్బతిన్నాయని, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని మండల వ్యవసాయ అధికారి కృష్ణ తెలిపారు. నర్సింగాపూర్‌లోని లగిశెట్టి రవి అనే వ్యక్తి ఇంటి పై రేకులు గాలికి ఎగిరిపడ్డాయి.
దండేపల్లి మండలంలో 7 గ్రామాల్లో సుమారు 86 ఎకరాల్లో మక్క పంట దెబ్బతిన్నదని, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని మండల వ్యవసాయాధికారి అంజిత్‌కుమార్ తెలిపారు. 10-15 రోజుల్లో చేతికి వచ్చే మక్క పంట నేలకొరగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికారులు సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జన్నారం మండలంలోని మొర్రిగూడలో మక్క పంట తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఏవో సంగీత పరిశీలించారు. సింగరాయిపేట, తిమ్మాపూర్, రాంపూర్, కవ్వాల్, కిష్టాపూర్, కొత్తపేట, కలమడుగు గ్రామాల్లో పంట నష్టాన్ని అంచనా వేశారు. నివేదికను అధికారులకు పంపిస్తామని తెలిపారు.
కూలిన గోడ..తప్పిన ప్రమాదం
కాసిపేట, మార్చి 22 : కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ఎస్సీ కాలనీలో కోట రాజేశ్‌కు చెందిన ఇంటి గోడ శుక్రవారం రాత్రి వర్షానికి కుప్ప కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తహసీల్దార్ భోజన్న ఆదేశాల మేరకు ఆర్ఐ కమల ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా చేశారు.
నిలిచిన విద్యుత్ సరఫరా
దహెగాం, మార్చి22: దహెగాం మండలం శుక్రవారం రాత్రి అంధకారంలో మగ్గింది. శుక్రవారం సాయంత్రం ఏర్పడి గాలివాన బీభత్సానికి ఈస్గాం 33 కేవీ విద్యుత్ లైన్‌పై చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రంతా చీకట్లోనే ప్రజలు ఇబ్బంది పడ్డారు. నీటి సమస్యతోనూ సతమతమయ్యారు. అధికారులు మరమ్మతులు చేపట్టి శనివారం మధ్యాహ్ననికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.