సిర్పూర్(టీ)/బెజ్జూర్/చింతలమానేపల్లి/భీమిని/కాసిపేట, జూలై 24 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలో రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. సిర్పూర్(టీ)-డోర్పల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో డోర్పల్లి, కొమ్ముగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చీలపల్లి గ్రామానికి వెళ్లే దారిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచాయి. బెజ్జూరు మండలంలో రైతులు, కూలీలు వర్షంలో తడుస్తూనే వ్యవసాయ పనులు చేపట్టారు. పొలాల్లో భారీగా వరద నిలిచింది.
చింతలమానేపల్లి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా గురువారం పర్యటించారు. దిందా-కేతిని వాగును పరిశీలించారు. తీవ్ర వర్షాభావం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. గూడెం-అంతర్రాష్ట్ర వంతెన వద్ద ప్రాణహిత నది, కోయపల్లి,దిందా, శివపల్లి వాగుల ఉధృతిని తహసీల్దార్ ధవ్లత్ కుమార్, ఆర్ఐ విజయ్ పరిశీలించారు. బాబాసాగర్, రణవెళ్లి బాలాజీ అనుకోడ, గంగాపూర్, బూరపల్లి సమీపంలోని వాగులు, ఒర్రెల వద్ద ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా తాళ్లు కట్టి రాకపోకలు బంద్ చేశారు.
పంట పొలాల్లోకి వరద చేరడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో కురుస్తున్న వర్షాలకు చెన్నాపూర్-రాజారం వెళ్లే దారిలోని కల్వర్టు తెగిపోయింది. దీంతో వ్యవసాయపనులకు వెళ్లే రైతులు, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న తిమ్మాపూర్పంచాయతీలోని తంగళ్లపల్లి గ్రామానికి చెందిన చాపల భీమయ్య ఇంటి గోడ కూలిపోగా గురువారం ఎంపీడీవో గంగామోహన్ పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి తిరుపతితో కలిసి గ్రామంలో పర్యటించారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎర్రవాగుకు వెళ్లే దారిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. కాసిపేట మండలంలో గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వాగులు, చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరడంతో జల కళ సంచరించుకుంది. మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న గురువాపూర్లో రోడ్డు అధ్వానంగా మారడంతో గ్రామస్తులు డబ్బులు పోగు చేసుకొని బాగు చేసుకున్నారు. రోడ్డు మంజూరైందని చెప్పడమే తప్ప పట్టించుకున్న నాథుడు లేడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.