నిర్మల్, జూలై 22(నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నిర్మల్ జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండుముఖం పట్టిన ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లు అయింది. ముఖ్యంగా పత్తి, సోయా, మక్కతోపాటు పప్పు దినుసుల పంటలకు మేలు చేసే అవకాశం ఉంది. ఈ వానకాలంలో 4,33,300 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. చాలా చోట్ల రైతులు జూన్‌లోనే సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలకు విత్తనాలు మొలకెత్తగా.. ఆ తర్వాత వానలు ముఖం చాటేయడంతో పత్తి, సోయా, మక్క ఎండిపోయే పరిస్థితి నెలకున్నది. ఈ క్రమంలోనే కురిసిన భారీ వర్షాలు ఆరుతడి పంటలతోపాటు, వరి వేసే రైతులకు ఊరట కలిగించాయి.
ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం కురిసిన వానలతో చెరువుల్లోకి పెద్దగా వరద నీరు చేరలేదు. జిల్లాలో 734 చెరువులు ఉండగా, వీటి పరిధిలో 71,832 ఎకరాల్లో వరి సాగవుతున్నది. ఇప్పటి వరకు ఆయా చెరువులు కేవలం 20-30 శాతం మాత్రమే నిండాయని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తేనే చెరువుల కింద వరి పండే అవకాశాలు ఉన్నాయి. కడెం, స్వర్ణ ప్రాజెక్టులు నిండడంతో ఆయా ప్రాజెక్టుల కింద వరి సాగుకు ఢోకా లేదు.
ఆదిలాబాద్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కడెం, స్వర్ణ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 691 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 7718 క్యూసెక్కులు ఉండగా, ఒక గేటును ఎత్తి 2958 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా వానకాలం సాగు కోసం 298 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా, ప్రస్తుతం 1177.4 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నాయి. దీంతో సోమవారం ప్రాజెక్టు కింది ఆయకట్టు కోసం ఎడమ కాలువ ద్వారా 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
వానకాలంలో ఇప్పటివరకు 476.1 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అయితే గతేడాది ఇదే సమయానికి సగటు వర్షపాతం 519.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, ప్రస్తుతం 29 మి.మీ. లోటుగా ఉంది. అయితే ఇప్పటివరకు అత్యధికంగా నిర్మల్‌లో 640 మిల్లీ మీటర్లు, కుభీర్‌లో 431.9, తానూర్‌లో 376.3, బాసరలో 562.5, ముథోల్‌లో 408.7, భైంసాలో 337, కుంటాలలో 420.1, నర్సాపూర్(జి)లో 453.8, లోకేశ్వరంలో 453.1, దిలావర్పూర్లో 556.8, సారంగాపూర్‌లో 556.9, నిర్మల్ రూరల్‌లో 459.6, సోన్‌లో 503.1, లక్ష్మణచాందలో 516.9, మామడలో 416, పెంబిలో 515.1, ఖానాపూర్‌లో 441.8, కడెంలో 580.1, దస్తురాబాద్‌లో 416.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.