బాసర, మార్చి 7 : బాసర ఆర్టీయూకేటీకి హరితహారం అవార్డు లభించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సమావేశం, 75 వసంతాల సదస్సును మంగళవారం హైదరాబాద్ కాకతీయలో నిర్వహించారు. ఇందులో భాగంగా ‘భారతదేశం-తెలంగాణ వృద్ధిని వేగవంతం చేయడం, పోటీతత్వం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత స్థిరత్వం ద్వారా పునరుద్ధరణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ, జయేశ్ రంజన్(ఐఏఎస్), సుచిత్రా ఎల్లా (ఎండీ, భారత్ బయోటెక్), పలువురు పరిశ్రమ ప్రముఖులు, సీఈవోలు హాజరయ్యారు. ఆరు నెలల వ్యవధిలో భారీ ప్లాంటేషన్, ఎకో పార్క్, సరస్సు సుందరీకరణ చేపట్టినందుకు గాను ఆర్జీయూకేటీ సీఐఐ (కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ హరితహారం అవార్డును ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ చేతుల మీదుగా వీసీ వెంకటరమణ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి మనిషి ప్రకృతి నిబద్ధత కాపాడాలని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు రూపకల్పన హరితహారం కార్యక్రమమన్నారు. భవిష్యత్లో పచ్చని తెలంగాణ కావాలని కలలు కన్నారని, ఆ దిశగానే ఆర్జీయూకేటీ పయనిస్తున్నదని పేర్కొన్నారు. దానికి బాసర ఆర్జీయూకేటీ వీసీ కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. యూనివర్సిటీకి అన్ని విధాలా అండగా నిలిచిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు అందుకోవడంలో ఎంతో కృషి చేసిన ఆర్జీయూకేటీ కుటుంబ సభ్యులందరికీ అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు.