మంచిర్యాల, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోరు పెంచింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్యనాయకులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(శుక్రవారం) మాజీ మంత్రి హరీశ్‌రావు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గల రాజీవ్‌చౌక్‌లో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. అక్కడి నుంచి బెల్లంపల్లి రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. స్థానికంగా నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారు.
ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. హరీశ్‌రావు పర్యటన సందర్భంగా క్యాతన్‌పల్లి బల్దియాలో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజీవ్‌చౌక్‌లో రోడ్ షో నేపథ్యంలో ఏర్పాట్లపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. హరీశ్‌రావు పర్యటన సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీల నుంచి జనాలు తరలిరానున్నారు. ఇప్పటికే వరుస చేరికలతో బీఆర్ఎస్ జోష్ మీద ఉండగా, మాజీ మంత్రి హరీశ్‌రావు రాక పార్టీకి, పోటీ చేస్తున్న అభ్యర్థులకు బలం చేకూర్చనున్నది.
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటూ హోరెత్తిస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్‌రావు డివిజన్లలో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జిల్లాలో సమన్వయ సమావేశాలతోపాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించి, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనదైన శైలిలో పర్యటనలు, ప్రచారాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిత్యం రివ్యూ మీటింగ్‌లు పెడుతూ.. క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జోగు రామన్న రోజు నాలుగైదు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో పార్టీ ఎన్నికల ఇన్చార్జి అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో జాన్సన్ నాయక్ ప్రచార కార్యక్రమాలతో ప్రజల మధ్యే ఉంటున్నారు. ఇలా ఎక్కడి నేతలు అక్కడ ప్రచారాల్లో పాల్గొంటూ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తున్నారు.

ఎదులాపురం : ఆదిలాబాద్‌లో ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న

నిర్మల్ మున్సిపాలిటీలోని మంజూలాపూర్లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్, రాంకిషన్‌రెడ్డి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న జాన్సన్ నాయక్

నిర్మల్ జిల్లా భైంసా బల్దియాలో ప్రచారం నిర్వహిస్తున్న ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యురాలు రమాదేవి

నిర్మల్ జిల్లా భైంసా బల్దియాలో బీఆర్ఎస్కు ఓటేయాలని అడుగుతున్న ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు లోలం శ్యాంసుందర్, విలాస్ గాదేవార్, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్